calender_icon.png 1 October, 2024 | 5:01 AM

దసరాలోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ ?

01-10-2024 02:41:58 AM

మంత్రులు దామోదర, కొండా సురేఖతో సీఎం రేవంత్ చర్చలు

ఉమ్మడి మెదక్ జిల్లా ఆశావహుల్లో ఉత్కంఠ

ఇప్పటికే కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు

మెదక్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): ఉమ్మడి మెదక్ జిల్లాలో నామినేటెడ్ పోస్టు ల భర్తీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. దీనిపై ఇప్పటికే సీఎం తాజాగా ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మం త్రి కొండా సురేఖతో పాటు జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ సుదీర్ఘమైన చర్య లు జరిపినట్లు తెలిసింది.

దసరా లోపే పోస్టులు ఇవ్వాలని నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తుండడంతో ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది.  శ్రావణ మాసంలోనే ఈ పోస్టులను భర్తీ అవుతాయని సంకేతాలు వచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. దీం తో నాయకులు, కార్యకర్తలు నిరాశకు గురయ్యారు. ఈ విషయంపై మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు.

జిల్లాలో సుమారు 20 నామినేటెడ్ పోస్టులను భర్తీ  చేయాల్సి ఉంది. దీనిలో భాగంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌తో పాటు ఆరు మార్కెట్ కమిటీల కార్యవర్గాలు, మూడు ఆత్మ కమిటీలు, పది చోట్ల ఆలయ కమిటీలు నియమించా ల్సి ఉన్నది. ఇప్పటికే కొందరు ఆశావాహులు ఎమ్మెల్యేలు, మంత్రులు, రాష్ట్రస్థాయి నేతలను ప్రసన్నం చేసుకునేందుకు వారి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్లు తెలిసింది.

భారీగానే ఆశావహులు..

ఉమ్మడి జిల్లాలో నామినేటెడ్ పోస్టుల దక్కించుకునేందుకు ఆశావహులు పావులు  కదుపుతున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి దక్కించుకునేందుకు ప్రధానంగా  రెండు నియోజకవర్గాల నుంచి గట్టి పోటీ ఉన్నట్లు సమాచారం. మెదక్ నియోజకవర్గానికి చెందిన నేతకు ఈ పదవి ఇప్పిం చేందుకు కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు కృషి చేస్తున్నట్లు తెలిసింది.

అలాగే ఆలయ కమిటీ చైర్మన్లు, మార్కెట్ కమిటీల చైర్మన్లు, పాలకవర్గ పదవులకూ పోటీ ఎక్కువగానే ఉంది. మరోవైపు బీఆర్‌ఎస్‌తో పదేళ్ల పాటు అంటకాగి, ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన వారికే పార్టీలో ప్రాధాన్యం ఉందని, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఏళ్ల తరబడి జెండా మోసిన వారిని ఎవరూ పట్టించుకోవడం లేదని కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పోస్టులు సైతం ఇటీవల పార్టీలో చేరిన వారికే వెళ్తాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.