* ఎస్పీడీసీఎల్ అప్పీళ్లపై హైకోర్టు తీర్పు
హైదరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): జూనియర్ లైన్‌మెన్ పోస్టుల భర్తీ కోసం 2019 లో జారీచేసిన నోటిఫికేషన్‌లో కోర్టు ఉత్తర్వుల మేరకు భర్తీచేయకుండా ఉంచిన ఖాళీల్లో కోర్టు ను ఆశ్రయించిన అభ్యర్థులతో భర్తీ చేయాలని ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
లైన్‌మెన్ భర్తీ కోసం టీఎస్‌ఎస్పీడీసీఎల్ నోటిఫికే షన్లలో రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయడా న్ని సవాలు చేస్తూ హైకోర్టులో 25 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారించిన సింగిల్ జడ్జి లైన్‌మెన్ పోస్టులకు రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించవని తీర్పు వెలువరించారు.
దీన్ని సవాలు చేస్తూ టీఎస్‌ఎస్పీడీసీఎల్ 25 అప్పీళ్లు దాఖలు చేయగా వీటిపై జస్టిస్ అభినందు కుమార్ షావిలి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. టీఎస్‌ఎస్పీడీసీఎల్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ లైన్‌మెన్ స్థానిక పరిస్థితులపై అవగాహన ఉండాలని, జిల్లాకు చెందిన వారికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు.
రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయలేదని, స్థానికులకు ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఒకే మెరిట్‌పై ఇద్దరు అభ్యర్థులు ఉన్నప్పుడు స్థానిక జిల్లావాసికి ప్రాధాన్యం ఉంటుందన్నదాన్ని న్యాయమూర్తి తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. ప్రతివాదులైన దరఖాస్తుదారుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్ల ద్వారా పక్క జిల్లా వాళ్లకు కూడా అవకాశం లేకుండా పోయిందని, సింగిల్ జడ్జి తీర్పు సరైనదేనన్నారు.
పిటిషన్లు దాఖలు చేసిన సమయంలో కోర్టుకు వచ్చినవారి సంఖ్యకు అనుగుణంగా ఖాళీలు ఉంచాలని సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ సింగిల్ జడ్జి తీర్పును సవరిస్తూ నోటిఫికేషన్‌లో రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధనను తొలగిస్తున్నట్లు పేర్కొంది. మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం భర్తీ చేయకుండా ఉంచిన ఖాళీల్లో ప్రతివాదులతో (కోర్టుకు వచ్చినవారు) భర్తీ చేయాలని ఆదేశించింది.