శివాజీ విగ్రహం కేసులో పోలీసులకు హైకోర్టు ఆదేశం
ముంబై, నవంబర్ 13: మహారాష్ట్రలో 28 అడుగుల శివాజీ విగ్రహం కూలిన కేసుపై బాంబే హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ కేసులో ఇప్పటికే అరస్ట్ అయిన ఇంజినీర్ చేతన్ పాటిల్, శిల్పి జయదీప్ ఆప్టే బెయిల్ పిటిషన్లపై వాదనలు విన్న కోర్టు చార్జిషీట్‌ను దాఖలు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. అయితే, ఈ కేసులో వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ చార్జిషీట్‌ను కింది కోర్టులో దాఖలు చేసిన విషయాన్ని హైకోర్టుకు వివరించారు.
దిగువ కోర్టు వారి బెయిల్ పిటిషన్‌ను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే ఈ కేసును తిరిగి దిగువ కోర్టుకే బదిలీ చేయాలని కోరారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఉన్నత న్యాయస్థానం చార్జిషీట్‌లోని సాక్ష్యాధాలను పరిశీలించి బెయిల్‌పై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపింది. నవంబర్ 21 వరకు విచారణను వాయిదా వేస్తూ చార్జిషీట్‌ను దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.