గడువు పెంపు వార్తల్లో నిజం లేదు: ఐటీ శాఖ
హైదరాబాద్: గత ఆర్థిక సంవత్సరానికి గాను (అసెస్మెంట్ ఇయర్ 2024- 25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. ఇలాంటివి పన్ను చెల్లింపుదారులు నమ్మొద్దని ’ఎక్స్’ వేదికగా పేర్కొంది. గడువు తేదీ దగ్గరకు వచ్చిన నేపథ్యంలో అందరూ సాధ్యమైనంత త్వరగా రిటర్నులు సమర్పించాలని సూచించింది. పన్ను పోర్టల్లోనూ ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేవని పేర్కొంది.
గడువు తేదీ దాటితే సెక్షన్ 234ఏ కింద వడ్డీతోపాటు, సెక్షన్ 234ఎఫ్ ప్రకారం అపరాధ రుసు మూ వర్తిస్తుందని వెల్లడించింది. మూలధన నష్టాలను తదుపరి సంవత్సరాలకు సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని కోల్పోతారని పేర్కొంది. ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేటప్పుడు 26 ఏఎస్, ఏఐఎస్ (వార్షిక సమాచార నివేదిక)లను విధిగా తనిఖీ చేసుకోవాలని తెలిపింది.
అప్రమత్తంగా ఉండాలి
ఆదాయపు పన్ను రిఫండు కోసం ఎదురుచూస్తున్న వారికి కొన్ని మెస్సేజిలు వస్తు న్నాయని, వాటిని నమ్మొద్దని సూచించింది. రిఫండ్ కోసం బ్యాంకు ఖాతా వివరాలు పేర్కొనాలని, ఓటీపీలు చెప్పాలని కాల్స్ వస్తుంటాయని, వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఇప్పటికే దాదాపు 4.6 కోట్ల మంది రిటర్నులు దాఖలు చేసినట్లు ఆదాయపు పన్ను పోర్టల్ వెల్లడిస్తోంది. ఇందులో 4.2 కోట్ల మంది తమ రిటర్నులను ఈ -వెరిఫై చేసుకున్నారు. 1.8 కోట్ల రిటర్నులను ప్రాసెస్ చేసినట్లుపేర్కొంది.