calender_icon.png 24 October, 2024 | 5:04 AM

కేటీఆర్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేయండి

24-10-2024 12:23:23 AM

  1. ఆయన అండతోనే అంబేద్కర్ విగ్రహ గోడ కూల్చివేత
  2. అడిషనల్ డీజీపీకి కాంగ్రెస్ ప్రతినిధి బృందం ఫిర్యాదు

హైదరాబాద్, అక్టోబర్ 23(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అడిషన్ డీజీపీ మహేశ్ భగవత్‌కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం చుట్టూ సుందరీకరణ చేపట్టేందుకు జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన గోడను కూల్చేందుకు పరోక్షంగా ఆయనే కారణమన్నారు.

కేటీఆర్ అండతోనే బీఆర్‌ఎస్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారానికి ఒడిగట్టిందన్నారు. అంబేద్కర్ విగ్రహ గోడ కూల్చివేతకు కేటీఆర్ తన అనుచరుల ద్వారా కుట్ర పన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ చర్యల వల్ల దళితుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారని వాపోయారు. భవిష్యత్‌లో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

కేటీఆర్‌తో పాటు ఆ పార్టీ నేతలు క్రిశాంక్, కేటీఆర్ పీఏ తిరుపతి, ఇతర నాయకులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. అడిషనల్ డీజీపీని కలిసిన వారిలో పీసీసీ ఎస్సీసెల్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి ప్రీతమ్, తెలంగాణ ఖనిజ వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్‌కుమార్, మత్స్య కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, పీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ కొనగాల మహేశ్‌కుమార్ తదితరులు ఉన్నారు.