20-03-2025 11:35:31 PM
ముంబై హైకోర్టును ఆశ్రయించిన దిశా సాలియన్ తండ్రి..
నా కూతురి మరణంపై అనుమానాలున్నాయి..
ఆరోపణలు కొట్టిపారేసిన ఆదిత్య ఠాక్రే..
ముంబై: శివసేన (యూబీటీ) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రేపై కేసు నమోదు చేయాలంటూ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ తండ్రి సతీశ్ సాలియన్ ముంబై హైకోర్టును ఆశ్రయించారు. తన కూతురు మరణంపై అనుమానాలున్నాయని తెలిపిన సతీశ్ పిటిషన్‌లో ఆదిత్య ఠాక్రేపై లైంగిక ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు తనపై సతీశ్ సాలియన్ చేసిన ఆరోపణలపై ఆదిత్య ఠాక్రే స్పందించారు. ‘అవన్నీ అబద్ధాలు. నాపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. నా పరువు, ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు ప్రయత్నం జరుగుతోంది. ఇదంతా బీజేపీ తెర వెనుక ఉండి నడిపిస్తున్న నాటకం. ఈ అంశం కోర్టు పరిధిలో ఉంటే.. నేను నాయ్యస్థానంలోనే దీనిపై తేల్చుకుంటా’ అని ఆదిత్య పేర్కొన్నారు.
అసలేం జరిగింది..?
ఐదేళ్ల క్రితం బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అతడి మరణానికి వారం రోజుల ముందే సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. 2020 జూన్ 8న ముంబైలోని ఒక భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వారం వ్యవధిలోనే సుశాంత్ రాజ్‌పుత్ కూడా మరణించడం మహారాష్ట్రలో కలకలం రేపింది. ఆ సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కేసును తప్పుదోవ పట్టించిందనే ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పుడు దిశా సాలియన్ మృతిపై ఆమె తండ్రి సతీశ్ సాలియన్ ఎవరిపై అనుమానాలు వ్యక్తం చేయలేదు.
తాజాగా ఐదేళ్ల తర్వాత కూతురు మరణంపై అనుమానాలున్నాయంటూ ముంబై హైకోర్టును ఆశ్రయించడం ఆసక్తి రేకెత్తించింది. ఆదిత్య ఠాక్రేతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేయాలని పిటిషన్‌లో కోరారు. జూన్ 8న తన కుమార్తె ఇంట్లో చిన్న పార్టీ జరిగిందని.. దానికి ఆదిత్య ఠాక్రేతో పాటు అతడి బాడీగార్డులు, నటులు సూరజ్ పంచోలి, డినో మోరియా, మరికొందరు హాజరయ్యారని పిటిషన్‌లో తెలిపారు. దిశా సాలియన్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని.. అనంతరం సాముహిక అత్యాచారం చేశారని ఆరోపించారు. దీంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.