లుసాన్నె (స్విట్జర్లాండ్): భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్, మాజీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్‌లు 2024 ఏడాదికి గాను ‘ఎఫ్‌ఐహెచ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’, ‘బెస్ట్ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్నారు. హర్మన్‌తో పాటు అవార్డు కోసం నెదర్లాండ్స్ స్టార్లు జోప్ డి మోల్, థియెర్రి బ్రింక్‌మన్‌తో పాటు జర్మనీ స్టార్ హాన్స్ ముల్లర్, ఇంగ్లండ్ స్టార్ జాక్ వల్లాస్ మధ్య తీవ్ర పోటీ నెలకొనగా.. చివరకు అవార్డు భారత కెప్టెన్‌ను వరించింది.
ఆగస్టులో జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ కాంస్యం గెలవడంలో కెప్టెన్ హర్మన్‌ది కీలకపాత్ర. ఒలింపిక్స్‌లో హర్మన్ 10 గోల్స్‌తో మెరిశాడు. బెస్ట్ గోల్‌కీపర్ అవార్డుకు శ్రీజేశ్‌తో పాటు పిర్మిన్ బ్లాక్ (నెదర్లాండ్), లుయిస్ కల్జాడో (స్పెయిన్), జీన్ పాల్ (జర్మనీ), సాంటియాగో (అర్జెంటీనా)తో తీవ్ర పోటీ ఎదురైంది. అయితే ఒలింపిక్స్‌లో హాకీలో భారత్‌కు వరుసగా రెండో పతకం అందుకోవడంలో కీలకపాత్ర పోషించిన శ్రీజేశ్‌నే వరించింది.
అటు హర్మన్‌కు.. ఇటు శ్రీజేశ్‌కు ఇది మూడో ఎఫ్‌ఐహెచ్ అవార్డు కావడం విశేషం. గతంలో 2020-2021 రెండేసి సార్లు అవార్డు అందుకున్నారు. ‘ఒలింపిక్స్ అనంతరం స్వదేశంలో అశేష జనవాహిని మాకు ఘనస్వాగతం పలకడం మరిచిపోలేం. జట్టు లేకపోతే ఈ ఘనత సాధించేవాళ్లం కాదు’ అని హర్మన్ పేర్కొన్నాడు. శ్రీజేశ్ మాట్లాడుతూ.. ‘హాకీ ఇండియాకు ప్రత్యేక కృతజ్ఞతలు. నా భార్య, కూతురు ముందు అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది’ అని తెలిపాడు.