12-03-2025 01:29:58 AM
కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అతిమేల మానిక్
ఆందోల్, మార్చి 11 : శాస్త్ర సాంకేతిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ నేటికీ గ్రామ సీమల్లో కులవివక్ష అంటరానితనం ప్రత్యక్షంగా, పట్టణాల్లో పరోక్షంగా కొనసాగుతుందని దీనిని సహించబోమని ఏప్రిల్ నెల ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్ పిలుపునిచ్చారు.
మంగళవారం జోగిపేట పట్టణంలో జరిగిన సామాజిక సంఘాల నాయకుల సమావేశానికి ముఖ్యఅతిథిగా కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్ హాజరై మాట్లాడారు. నేటికి దళితులకు గుడి ప్రవేశం లేని గ్రామాలు, బతుకమ్మ ఆడనీయని గ్రామాలు, క్షవరం చేయకపోవడం,దసరా పండుగ సందర్భంగా జమ్మి ఆకు తెంపారని దాడి, హోటళ్ళలో రెండు గ్లాసుల పద్ధతి, పాఠశాలల్లో దళితులు మధ్యాహ్న భోజనం వంట చేస్తే విద్యార్థులు తినకపోవడం రచ్చబండ మీద కూర్చొనియ్యకపోవడం వంటి కులవివక్ష రూపాలు కొనసాగున్నాయని చెప్పారు.
పట్టణాల్లో దళితులకు ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదన్నారు .ఇంకా అనేక రూపాల్లో కుల వివక్ష అంటరానితనం కొనసాగుతుందన్నారు. వీటన్నిటిని పారద్రోలటానికి ఉన్న చట్టాలు జీవోలు రాజ్యాంగ బద్ధమైన హక్కులను పాలకవర్గాలు అమలు చేయడం లేదన్నారు. ఈ వివక్ష రూపాలపై ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు.
ఏప్రిల్ నెల మహనీయుల మాసంగా కేవీపీఎస్ ప్రకటించి పూలే అంబేద్కర్ జన జాతరలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. కుల వివక్ష అంటరానితనం ఎక్కడ కొనసాగితే అక్కడ ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటం నిర్మించాలన్నారు. కులవివక్ష అంటరానితనాన్ని సమూలంగా నిర్మూలనకు కేవీపీఎస్ సన్నద్ధం అవుతుందన్నారు.
ప్రణయ్ హత్య కేసులో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం...
నాడు కేవీపీఎస్ ప్రణయ్ కుటుంబానికి అండగా ఉంటే మతోన్మాద శక్తులు మారుతిరావు కు మద్దతుగా నల్గొండలో ప్రదర్శన నిర్వహించారని అన్నారు. ఈ తీర్పు కులోన్మదులకు కను విప్పు అన్నారు. కేవీపీఎస్ మాజీ జిల్లా కార్యదర్శి డి విద్యాసాగర్, సామాజిక సంఘాల నాయకులు అందోల్ మల్లేశం, దుర్గయ్య, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.