calender_icon.png 30 September, 2024 | 4:57 AM

హామీలు నెరవేర్చేవరకు పోరాటం

30-09-2024 02:47:18 AM

ఎంపీ ఈటల రాజేందర్

నేడు ఇందిరాపార్క్ వద్ద ‘రైతు హామీల సాధన దీక్ష’

హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ రైతులకిచ్చిన హామీలన్నీ నెరవేర్చేవరకు బీజేపీ పోరాడుతుందని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌తో కలిసి ఈటల మీడియాతో మాట్లాడారు.

ఇందిరాపార్క్ వద్ద సోమవారం ఉదయం 11 గంటల నుంచి మంగళవారం ఉదయం 11 గంటల వరకు 24 గంటల పాటు ‘రైతు హామీల సాధన దీక్ష’ చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ దీక్షలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులందరూ పాల్గొంటారని వెల్లడించారు. 

రుణమాఫీపై కాంగ్రెస్ నేతలు తలోమాట మాట్లాడుతున్నారని.. వాస్తవానికి ఇప్పటివరకు ఎంత రుణమాఫీ చేశారు, ఇంకా ఎంత చేయాల్సి ఉంది అనేది ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి అని ఈటల డిమాండ చేశారు. ఘట్‌కేసర్‌లో 1,206 మంది రైతులు క్రాప్‌లోన్ తీసుకోగా ఇప్పటివరకు 1006 మందికి రుణమాఫీ కాలేదని ఆయన వివరించారు.

ఈ దీక్షకు రైతులు భారీగా తరిలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఓట్ల కోసమే అలవికాని హామీలిచ్చి అన్ని వర్గాలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న దీక్షలో రైతన్నలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.