calender_icon.png 31 October, 2024 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరువు కోసం పాకులాట

31-10-2024 12:45:40 AM

గెలుపు కోసం టీమిండియా ఆరాటం

  1. క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన కివీస్ 
  2. నవంబర్ 1 నుంచి మూడో టెస్టు

* స్వదేశంలో పుష్కర కాలం తర్వాత టెస్టు సిరీస్ కోల్పోయిన టీమిండియా తొలిసారి విజయం కోసం ఆశగా ఎదురు చూడాల్సిన పరిస్థితి. ముంబై వేదికగా శుక్రవారం నుంచి మొదలుకానున్న మూడో టెస్టులో గెలిచి భారత్ పరువు కాపాడుకోవాలని చూస్తుంటే.. తొలిసారి రోహిత్ సేనను క్లీన్‌స్వీప్ చేయాలని న్యూజిలాండ్ పట్టుదలతో ఉంది.

ముంబై: సొంతగడ్డపై టెస్టు సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా శుక్రవారం నుంచి వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో మూడో టెస్టు ఆడనుంది. తొలి టెస్టులో ఓట మి చవిచూసిన టీమిండియా రెండో టెస్టు లో ఏరి కోరి స్పిన్ ట్రాక్‌ను తయారు  చేయి స్తే ఫలితం బెడిసికొట్టింది.

బౌలింగ్ బాగున్నప్పటికీ బ్యాటింగ్ వైఫల్యం కారణంగా మ్యాచ్‌ను కోల్పోయింది. ఫలితంగా 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా మూడో టెస్టులో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది. వాంఖడే వేదికగా జరిగిన టెస్టుల్లో భారత్‌కు మంచి రికార్డులు ఉన్నప్పటికీ మన ఆటతీరు చూస్తుంటే అవేవి పనికిరావన్న చందంగా తయారైంది.

స్పిన్ ట్రాక్‌ను నమ్ముకున్న భారత్ ముంబై వేదికగా జరగనున్న మూడో టెస్టుకు ఈసారి గేర్ మార్చి పేస్ ట్రాక్‌తో సిద్ధమైనట్లు కనిపిస్తోంది. మరి ఈసారైనా ఫలితం సాధిస్తారా లేక కివీస్‌కు దాసోహమంటారా వేచి చూడాలి.

కలవరపెడుతున్న రోహిత్..

తొలి రెండు టెస్టుల్లో వైఫల్యాలను బేరీజు వేసుకొని చూస్తే సమస్యంతా బ్యాటింగ్‌లోనే కనిపిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్‌లో దారుణంగా విఫలమవుతూ వస్తున్నాడు. నాలుగు ఇన్నింగ్స్‌లు కలిపి ఒక్క అర్థసెంచరీ మినహా మూడు సార్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. రానున్న ఆస్ట్రేలియా సిరీస్ ను దృష్టిలో పెట్టుకొని చూస్తే హిట్ మ్యాన్ ఫామ్‌లోకి రావాల్సిందే.

ఇక విరాట్ కోహ్లీ కూడా అంతగా రాణించింది లేదు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ మాత్రం సూపర్ ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం. గిల్, పంత్, సర్ఫరాజ్, రాహుల్ రాణిస్తున్నప్పటికీ నిలకడ లోపించింది. ఆల్‌రౌండర్‌గా జడేజా ప్రభావం చూపించలేకపోతున్నాడు. అశ్విన్, సుందర్ బౌలింగ్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు. పేస్ విభాగంలో బుమ్రా, ఆకాశ్ దీప్‌తో పాటు హర్షిత్ రానాకు చోటు దక్కే చాన్స్ ఉంది.

క్లీన్‌స్వీప్ లక్ష్యంగా..

మరోవైపు ఇప్పటికే టెస్టు సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకున్న న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. భారత్‌కు అచ్చిరాని పిచ్‌లపై చెలరేగిపోతున్న కివీస్ ముంబై టెస్టు లోనూ అదే ఫీట్‌ను పునరావృతం చేయాలని చూస్తోంది. ఇక వాంఖడే వేదికగా చివరి టెస్టు న్యూజిలాండ్‌తో ఆడిన టీమిండియా ఆ మ్యాచ్‌లో 372 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.