calender_icon.png 8 April, 2025 | 1:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగ భద్రతపై ‘ఆశ’!

08-04-2025 12:00:00 AM

వేళాపాళా ఉండదు.. వేతనం లేని ఉపాధి

పని ఒత్తిడి.. పట్టించుకోని సర్కార్

ఫిక్స్ డ్ వేతనాల కోసం పోరాటం

సిద్దిపేట, ఏప్రిల్ 7 (విజయక్రాంతి):  ఉన్న ఊరిలో ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తుందనే ఆశతో ఆశా వర్కర్ గా చేరిన పాపానికి పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. సమయపాలన లేకుండా పనులు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలలో ప్రభుత్వం విధించిన టార్గెట్స్ చేయకపోతే ఉపాధి నుంచి తొలగిస్తా మని అధికారుల బెదిరింపులు, మరోవైపు గ్రామంలోని ప్రజా ప్రతినిధులు, స్థానిక అధికారులు చెప్పిన పని చేయకపోతే ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామంటూ వేధింపులు భరించుకుంటూ చాలీచాలని వేతనంతో కుటుంబ పోషణలో తోడ్పాటు అందిస్తున్నారు.

ప్రతి నెల ఏఎన్ సీ కి ఇద్దరినీ నమో దు చేయించాలని, టీబీ రోగుల ఇంటికి వెళ్లి వారి స్ఫుటం సేకరించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లడం, గర్భిణీలను ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకెళ్తే డెలివరీ అయ్యన్నీ రోజులు ఆస్పత్రిలోనే ఉండా లనే నిబంధనలు ఇబ్బందికరంగా ఉన్నాయని వాటిని సడలించాలని కోరుతున్నారు. కనీసం పదవ తరగతి చదవని వారు ఆశా వర్కర్లుగా అధిక సంఖ్యలో ఉన్నారని, అలాంటి వారితో ఆయుష్మాన్ భారత్ పథకం లబ్ధిదారుల్ని ఆన్లైన్ చేయించడం బాధాకరమన్నారు.

అయితే యాప్ ద్వారా నమోదు చేసినప్పటికీ, ఫోన్లో నమోదు చేయాల్సి రావడం వల్ల తలనొప్పి, మెడ నొప్పి, వెన్నుపూస నొప్పులు ఏర్పడుతున్నాయని వాపోతున్నారు. ఈ విషయాన్ని అధి కారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. గ్రామాల నుంచి గర్భిణీలను డెలివరీ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లినప్పుడు అక్కడ డ్రెస్ మా ర్చుకోవడానికి, కాసేపు సేద తీరడానికి గది లేకపోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు గర్భిణీలను డెలివరీ కి తీసుకెళ్తే అక్కడున్న వైద్యులు కోపగించడం బాధ కలిగిస్తుందిన్నారు.

గ్రామాలలో రాత్రి, పగలు తేడా లేకుండా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు అనేక సర్వేల కోసం, వివిధ కార్యక్ర మాలలో పాల్గొనేలా ఆదేశించడం వల్ల తమ టార్గెట్ ని రీచ్ కాలేకపోతున్నామని ఆశ వర్కర్లు చెబుతున్నారు. గత సంవత్సరం పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. డిఏ ఇవ్వలేదని, లెప్రసి సర్వే చేపించిన ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోగా మళ్లీ సర్వే చేయమని ఆదేశించడం బాధాకరమన్నారు. అసలే నిర్ణీత వేతనం లేకుండా పనిచేస్తున్న తమకు అనవసరపు పనులు చెబుతూ కష్టాన్ని దోచుకుంటున్నారని చెబుతున్నారు.

ఆశాల డిమాండ్... 

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఫికస్డ్ వేతనం రూ.18 వేలు ఇవ్వాలని, ఈఎస్‌ఐ, పిఎఫ్, బీమా సౌకర్యం కల్పించాలనీ ,జాబ్ చార్ట్ ప్రకటించాలనీ, ప్రభుత్వ ఆసుపత్రిలో ఆశా వర్కర్లకు ప్రత్యేకంగా గది కేటాయించాలని, ఎన్నికలలో, పల్స్ పోలియో, వివిధ సర్వేలలో పాల్గొన్నప్పుడు ఇవ్వాల్సిన డైలీ వేజ్ వెంటనే చెల్లించాలనీ, అర్హులైన ఆశా వర్కర్లకు ఏఎన్‌ఎం పదోన్నతి కల్పించాలి, టార్గెట్ విధించకుండా పని చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఇచ్చిన హామీ అమలు చేయాలి.. 

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆశా వర్కర్లకు రూ.18 వేలు  ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి సంవ త్సరం గడిచిన ఆశా వర్కర్లకు ఇస్తానన్న వేతనం ఇవ్వకపోగా, మా సమస్యలు కూడా పట్టించుకోవడం లేదు. గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అమలు చేయడానికి ఆశా వర్కర్లు కీలక భూ మి పోషిస్తున్నారు.  వెంటనే ఈఎస్‌ఐ, పిఎ ఫ్, బీమా సౌకర్యాలతో పాటు రూ.18 వేల వేతనం ఇస్తూ సమస్యలు పరిష్కరించాలి. 

ప్రవీణ, ఆశా వర్కర్స్ సంఘం జిల్లా అధ్యక్షురాలు, సిద్దిపేట

పదోన్నతి కల్పించాలి.... 

ఏఎన్‌ఎం కోర్సు చదివి ఆశ వర్కర్లుగా పనిచేస్తున్న వారికి పదోన్నతి కల్పిస్తూ ఏఎన్‌ఎంగా నియమించాలి. ఉద్యోగానికి సంబంధం లేని పనులు చేపిస్తూ ఇబ్బందులకు గురి చేయడం సరికాదు. ప్రభుత్వం వెంటనే జాబ్ చార్ట్ ని విడుదల చేసి ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి. ప్రభు త్వం స్పందించకపోతే నిరసనలు తీవ్రతరం చేస్తాం. అధికారులు వారి స్థాయిలోని ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.

భాగ్యలక్ష్మి, ఆశా వర్కర్, అప్పనపల్లి, దుబ్బాక