ప్యాట్రిసియా నారాయణ్.. తమిళనాడులోని నాగర్ కోయిల్‌లో సంప్రదాయ క్రిస్టియన్ కుటుంబంలో పుట్టింది. 17 ఏళ్ల వయసులోనే తన ఇష్టానికి వ్యతిరేకంగా బ్రాహ్మణ యువకుడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పెళ్లైన కొన్ని నెలలకే తన భర్త డ్రగ్ అడిక్ట్ అని తెలుసుకుంది. అంతేకాదు.. కుటంబపోషణ కోసం పనిచేయడు. మత్తుకు బానిసై భార్యను కొట్టేవాడు. దాంతో పెళ్లయిన కొన్ని సంవత్సరాలకే ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. పుట్టింటికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పింది.
కుటుంబ సభ్యులు కూడా ఆమెను అర్ధం చేసుకోవడంతో సొంత ఆలోచనల వైపు అడుగులు వేసింది. తల్లిదండ్రులు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కావడం ప్యాట్రిసియాకు కలిసివచ్చింది. అయితే ఆమెకు చిన్నపట్నుంచే వంటపై ఆసక్తి ఉంది. దానిని వృత్తిగా ఎంచుకుంది. తల్లి నుంచి ఆర్థిక రుణం తీసుకుని ఇంట్లో ఊరగాయలు, జామ్ లు వండిపెట్టింది. ఒక్క రోజులోనే అన్నీ అమ్మేసేది. రుచికి రుచి, క్వాలిటీకి క్వాలిటీ ఉండటం అందుకు కారణం.
చిన్న టీకొట్టుతో..
ప్యాట్రిసియా చెన్నైలోని అత్యంత రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలలో ఒకటైన మెరీనా బీచ్ సమీపంలో ఒక చిన్న బండిని ప్రారంభించింది. తొలినాళ్లలో ఒక కప్పు కాఫీని 50 పైసలకు అమ్మేవారు. ఆ తరువాత తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలనుకున్నారు. కాఫీ, టీతో పాటు స్నాక్స్ కూడా అమ్మింది. ఇద్దరు దివ్యాంగులకు పనికల్పించింది. దాంతో ఆమె సంపాదన రూ.50 నుంచి రూ.700కు పెరిగింది. ఆరోజు నుంచే ఆమె ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది.
1982 నుంచి 2003 వరకు పట్టుదలతో తన కుటుంబాన్ని పోషించడానికి తగినంత సంపాదించింది. అయితే ఒకసారి స్లమ్ క్లియరింగ్ బోర్డు చైర్మన్ ఆమె ఫుడ్ కు ముగ్ధుడై తన కార్యాలయంలో క్యాంటీన్ ప్రారంభించమని ఆహ్వానించారు. ఆ తర్వాత చెన్నైలోని ప్రతి కార్యాలయంలో కొత్త బ్రాంచీలను ప్రారంభించి ఇంతింతై అన్నట్టుగా దూసుకుపోయింది. ఆతర్వాత దేశంలో పేరొందిన సంగీత రెస్టారెంట్ బిజినెస్‌లోకి ఎంటరైంది.
రోజుకు రూ.2 లక్షలు
అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో 2006లో ఆమె కుమారుడు కారు ప్రమాదంలో మరణించాడు. ఈ ఘటన ఆమెను ఎంతగానో బాధించింది. ఆతర్వాత కుమారుడి గౌరవార్ధంగా సందీపా అనే రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం.. చెన్నైలో 14 ప్రదేశాల్లో.. 200 మందికిపైగా ఉద్యోగులతో అనేక రెస్టారెంట్లు సక్సెస్ ఫుల్‌గా నడుస్తున్నాయి. రోజుకు రూ .2 లక్షలకు పైగా ఆదాయాన్నిస్తున్నాయి. ప్రస్తుతం ప్యాట్రిసియా నారాయణ్ మొత్తం ఆస్తులు రూ .100 కోట్లకు చేరుకున్నాయంటే ఆమె ఏస్థాయిలో కష్టపడ్డారో తెలుసుకోవచ్చు.
సాధించాలనే పట్టుదల.. చేయాలనే తపన ఉంటే.. ఏదైనా సాధించవచ్చు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్నది సాధించవచ్చు. 17 ఏళ్ల వయసులో పెళ్లి.. పైగా ఇద్దరు పిల్లలు.. భర్త డ్రగ్ అడిక్ట్.. ఇలాంటి కష్టసమయంలో పిల్లలతో ఒంటరి పోరాటం చేసిందామె. నాడు రోజుకు 50 పైసలు సంపాదించినా ఆమె.. నేడు కోటిశ్వరాలు స్థాయికి ఎదిగింది. ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తూ సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్‌గా రాణిస్తున్నారు ప్యాట్రిసియా నారాయణ్.