- మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో హృదయ విదారక ఘటన
- విదర్భలో దుర్భర పరిస్థితులకు అద్దం పడుతున్న వైనం
గడ్చిరౌలీ(మహారాష్ట్ర), సెప్టెంబర్ 5: జ్వరం తో బాధపడుతున్న ఇద్దరు సోదరులకు సకాలంలో వైద్యం లభించకపోవడంతో గంటల వ్యవధిలోనే మరణించారు. వారి శవాలను స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో మృతదేహాలను వారి తల్లిదండ్రులు దాదాపు 15 కిలోమీటర్లు భుజా న మోసుకెళ్లిన హృదయ విదారక ఘటన మహారాష్ట్రలోని గడ్చిరౌలి జిల్లాలో చోటు చేసుకుంది. ముంబై వంటి మహానగరం ఉన్న మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
గడ్చిరోలి జిల్లాలోని మారుమూల గ్రామమైన పట్టిగావ్‌కు చెందిన ఓ నిరు పేద కుటుంబంలో పదేళ్లు కూడా నిండని ఇద్దరు సోదరులు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో వారిని సమీపంలోని ఓ పట్టణంలో పిల్లలకు చికిత్స చేయించేందుకు తీసుకువెళ్లారు. ఆసుపత్రిలో సకాలంలో వైద్యం అందక ఆ ఇద్దరు మృతిచెందారు.
15 కిలో మీటర్లు బురదలో నడుస్తూ..
వారి మృతదేహాలను స్వగ్రామమైన పట్టిగావ్‌కు తరలించేందుకు ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్ ఇవ్వలేదు. ప్రైవేట్ వాహనంలో తీసుకెళ్లేందుకు ఆ తల్లిదండ్రులకు స్థోమత లేకపోవడంతో.. పిల్లలిద్దరి మృతదేహాలను భుజా న వేసుకొని మట్టిరోడ్డులో వర్షంలో తడుస్తూ, బురదలో దాదాపు 15 కిలోమీటర్లు నడుచుకుంటూ ఆ తల్లిదండ్రులు అతికష్టం మీద గ్రామానికి చేరుకున్నారు. ఇందుకు సంబంధిం చిన వీడియోలు వైరల్‌గా మారాయి.