calender_icon.png 6 February, 2025 | 9:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రగులుతున్న రాజకీయ చైతన్యం

31-01-2025 12:00:00 AM

డాక్టర్ తిరుణహరి శేషు :

తెలంగాణ స్వాభావికంగా ఉద్యమ నేల. ఈ నేల తల్లి ఎన్నో వామపక్ష ప్రగతిశీలక, సామాజిక ప్రజాతంత్ర ఉద్యమాలకు పురుడు పోసింది. నిజాం వ్యతిరేక ఉద్యమం నుండి తెలంగాణ ప్రత్యే క రాష్ట్ర ఉద్యమంవరకు ప్రజల చైతన్యం, ఉద్యమ స్ఫూర్తి కళ్లముందు కదలాడుతూనే ఉంది.

తెలంగాణ ఉద్యమం అస్తిత్వ ఉద్యమాలకు ప్రేరణగా నిలబడుతున్న తరుణంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రంలో అత్యధిక జనాభాగల బలహీన వర్గాలు తమ రాజకీయ అధికారం, సంక్షే మం, అభివృద్ధి, అస్తిత్వం కోసం ఉద్యమానికి సిద్ధమవుతున్న ఛాయలు కనపడుతు న్నాయి.

దశాబ్దాలుగా సమైక్యాంధ్రప్రదేశ్‌లో, తెలంగాణ రాష్ట్రంలో తమకు అభి వృద్ధి, అవకాశాలు, అధికారంలో అన్యా యం జరిగిందనే ఆలోచనతో బలహీనవర్గాలు ఉద్యమాల వైపుకు కదులుతు న్నట్లుగా కనిపిస్తుంది. 

అగ్రవర్ణ రాజకీయ ఆధిపత్యం 

 సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో, రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత కూడా రాజ కీయాలలో అగ్రవర్ణ రాజకీయ ఆధిపత్యం కొనసాగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాలలో మూడు సార్లు ఎన్నికలు జరిగితే అన్నిసార్లూ అగ్రవర్ణాలే రాజకీయ అధికారాన్ని చేజేక్కించుకున్నాయి.

జనాభాలో అత్యధిక శాతం ఉన్న బలహీనవర్గా లకు చట్టసభలలో రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడం వలన అధికారం దక్కకపోవడంతో సరైన అవకాశాలు  దక్కటం లేదనే అసంతృప్తి బలహీన వర్గాలలో గూడుకట్టుకొని ఉన్నది.

58 సంవత్సరాలు కొనసా గిన సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో కానీ దశాబ్దపు విభజిత రాష్ట్రాలలో కానీ ఒక్కసారి కూడా బీసీకి ముఖ్యమంత్రిగా అవకాశం దక్కలేదంటే అగ్రవర్ణ రాజకీయ ఆధిపత్యం ఏ స్థాయిలో కొనసాగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. సమైక్యాంధ్రప్రదేశ్ లో 16 మంది ముఖ్యమంత్రులుగా పనిచేస్తే 15 మంది అగ్రవర్ణాలకు చెందిన వారు కాగా, వారిలో 11 మంది ఒకే కులానికి చెందినవారు.

దశాబ్దపు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అధికారంలో బీసీలకు అన్యాయమే జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మో హన్‌రెడ్డి మంత్రివర్గంలో ఒక బీసీకి ఉప ముఖ్యమంత్రిగా, పదిమంది బీసీలకు మంత్రివర్గంలో అవకాశం దక్కింది. కానీ తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రిగా అవకాశం దక్కకపోగా ఉపముఖ్యమంత్రి పదవి కూడా బలహీనవర్గాలకు దక్కలేదు. మంత్రివర్గంలో కూడా సరైన ప్రాతినిధ్యం, ప్రాధాన్యత దక్క లేదు.

రాష్ట్రంలో రాజకీయ అధికారంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం లోనూ, కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ బీసీలకు గౌరవప్రదమైన స్థానం దక్కలేదనేది వాస్తవం. రెండు రాష్ట్రాల్లో భవిష్యత్తులోనైనా బీసీలకు రాజకీయ అధికారం దక్కే సూచనలు కనపడకపోవటం వలన రాజకీయ అధికారం కోసం బలహీన వర్గాల మెదళ్లలో ఆలోచన మొదలైందనే చెప్పాలి.

చైతన్యం దిశగా అడుగులు 

 తమ దశాబ్దాల వెనుకబాటుతనానికి 77 ఏళ్లుగా స్వతంత్ర భారతంలో పార్టీలు, ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే కారణమనే విషయాన్ని బలహీన వర్గాలు అనేక వేదికలపైన మాట్లాడుతున్నాయి. కాకా కలేల్కర్ కమిషన్, మండల్ కమిషన్, జస్టిస్ రోహిణి కమిషన్ సిఫారసులను అమలు చేయటానికి ముందుకు రాకుం డా ప్రభుత్వాలు బలహీనవర్గాల అభివృద్ధి సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేశాయనే భావన బీసీ వర్గాలలో గూడుకట్టుకొని ఉన్నది.

గతంలో కంటే బీసీలలో చైతన్యం పెరిగింది. ఆ  చైతన్యం ఉద్యమరూపంగా మా రి అధికారం దిశగా అడుగులు వేసే కార్యాచరణ బలహీనవర్గాల నుండి మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బీసీలు వివిధ కులాలుగా విడిపోయి ఉన్నారు కాబట్టి వారిలో ఐక్యత ఉండదని పార్టీలు, ప్రభుత్వాలు భావిస్తున్నంతకాలం బీసీలను బల మైన ప్రభావిత శక్తిగా గుర్తించవు. 

 కానీ పార్టీలు, ప్రభుత్వాలు  ఒక విషయాన్ని మర్చిపోతున్నాయి. ఐక్యత లేకపోయినా బలహీనవర్గాల సమాజం తమకు జరుగుతున్న అన్యాయాన్ని, వివక్షతను గుర్తించట మే కాదు వివిధ సమస్యలపై ఉద్యమించే చైతన్యం పెరగటం భవిష్యత్తు అధికారానికి బాట వేస్తుంది.

బలహీనవర్గాలలో పెరుగుతున్న చైతన్యాన్ని గమనించిన రాజకీయ పార్టీలు బీసీలను తమ వైపుకు తిప్పుకొనే ప్రయత్నాలు ప్రారంభించాయి. కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్ష పదవిని బీసీలకు ఇస్తే, బీజేపీ కూడా రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వటానికి సిద్ధపడుతోంది.

అలాగే బీఆర్‌ఎస్ పార్టీ ఇటీవల బీసీల సమస్యలపై ఉద్యమించటం,పార్టీకి మరొక వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీసీకి అవకాశం ఇచ్చే ఆలోచన చేస్తున్నదంటే బీసీలలో పెరిగిన చైతన్యాన్ని పార్టీలు తమ వైపునకు తిప్పుకొనే ఎత్తుగడలో భాగంగానే చూడాలి. కానీ అగ్రవర్ణాల రాజకీయ ఆధిపత్యం నుండి బయట పడాలనే ఆలోచన బలహీనవర్గాలలో కనిపిస్తుంది. 

స్థానికంనుండే మొదలవ్వాలి 

 తెలంగాణలో కులగణన, స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్ల అంశం బీసీల లో చైతన్యం పెరగటానికి దోహదపడింది. తెలంగాణలో ఎన్నడూ లేనంతగా బీసీ సం ఘాలు, కుల సంఘాలు, బీసీ విద్యావంతులు బలహీన వర్గాల సమస్యలపైన, హ క్కులపైన మాట్లాడుతున్నారు. ఇదే వారి లో పెరిగిన చైతన్యానికి తార్కాణం. 

ఈ చైతన్యం ఉద్యమ రూపంలోకి మారటానికి స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ ఎన్నికలలో బీసీల రిజర్వేషన్లు ఒక వేదికగా మారే ప్రయత్నం జరుగుతోంది. బలహీన వర్గాల యుద్ధం స్థానిక ఎన్నికల నుండే ప్రారంభించే కార్యాచరణ మొదలయ్యే అవకాశా లు కనిపిస్తున్నాయి.

స్థానిక సంస్థలలో బీసీలకు ఉన్న రిజర్వేషన్లు 34 శాతం నుండి 23 శాతానికి తగ్గిపోవడం వలన బలహీనవర్గాలు 1405 గ్రామపంచాయతీలలో అధికారాన్ని, అవకాశాలను కోల్పోయారు.

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించలేక పోతే పెరగబోతున్న గ్రామపంచాయతీల తో కలిపి 13వేల పంచాయతీలలో (ప్రస్తుతం 12,769 పంచాయతీలు) 23 శాతం రిజర్వేషన్ల ద్వారా వచ్చే 2990 గ్రామపంచాయతీలలో, 6500 జనరల్ పంచాయ తీలలో అంటే దాదాపు 9,490 గ్రామపంచాయతీలలో బీసీలు ప్రెసిడెంట్లుగా పోటీ చేసే ఆలోచన చేసి రాజకీయ పార్టీలకు సవాల్ విసరాలి.

స్థానిక సంస్థలలో బీసీల నినాదం జై తెలంగాణ నినాదం స్థాయిలో మార్మోగాలి. అప్పుడే తెలంగాణలోని రాజకీయ పార్టీలు బీసీలను ప్రభావిత శక్తిగా గుర్తించటమే కాదు,అవకాశాలు ఇవ్వటానికి కూడా ముందుకు వస్తాయి. 

దశాబ్దాల వివక్షత 

దశాబ్దాలుగా బలహీన వర్గాలు అభివృద్ధిలో, అవకాశాలలో, అధికారంలో వివక్షత ని ఎదుర్కొంటూనే ఉన్నాయి. బలహీనవర్గాల అభివృద్ధికి బడ్జెట్‌లో చాలీచాలని నిధుల కేటాయింపు, బలహీనవర్గాల సంక్షేమానికి కంటితుడుపుగానే ప్రత్యేక పథకాలు ప్రకటిస్తారు. వాటిని కూడా చిత్తశుద్ధితో అమ లు చేయరు.  విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉన్నా అమలు చేయరు.

రాజకీయ అధికారం, గౌరవప్రదమైన వాటా దక్కనివ్వరు. కాబట్టి సరైన వాటా దక్కాలంటే ఉద్య మ బాట పట్టాలి. దేశవ్యాప్తంగా కులగణన జరగాలి. చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి,  కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలో బీసీల సంక్షేమానికి నిధులు పెంచాలి, తెలంగాణ రాష్ట్రంలో కులగణన వివరాలను బయటపెట్టాలి, కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలి, బీసీ సబ్ ప్లాన్ ప్రకటించాలి, బీసీ విద్యార్థులకు ఆంక్షలు లేకుండా ఫీజు రియంబర్స్‌మెంట్ చెల్లించాలిలాంటి అంశాలపైన భవిష్యత్తులో బీసీలు తమ గళాలను ఎత్తబోతున్నారు. 

అయితే బలహీన వర్గాల ఉద్యమం స్వప్రయోజనాలకు, వ్యక్తిగత రాజకీయ అవసరాలకు పరిమితం కారాదు. ఒకటి రెండు కులాల చేతులలో ఉద్యమం బందీ కారాదు. బలహీన వర్గాల విస్తృత ప్రయోజనాల పరిరక్షణ, దశాబ్దాల సమస్యలకు పరిష్కారం చూపే విధంగా బీసీ ఉద్యమాల కార్యాచరణ ఉండాలి. రాజకీయ చైతన్యంతో అధికారం వైపు అడుగులు వేసినప్పుడే దశాబ్దాల వెనుకబాటుతనం నుండి విముక్తులవుతారు.

 వ్యాసకర్త సెల్: 9885465877