calender_icon.png 16 January, 2025 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమ్మూలో భీకర ఉగ్రదాడి

17-07-2024 06:39:30 AM

  • నలుగురు సైనికుల వీరమరణం 
  • గడిచిన 32 నెలల్లో 48 మంది సైనికుల్ని కోల్పోయిన ఆర్మీ

న్యూఢిల్లీ, జూలై 16: జమ్ముకశ్మీర్‌లో మరోమారు ఉగ్రవాదులు భీకర దాడికి పా ల్పడ్డారు. దోడా జిల్లాలో సోమవారం సైనికులకు, ఉగ్రవాదులకు జరిగిన కాల్పుల్లో నలుగురు సైనికులు వీరమరణం పొందారు. ఐదుగురు సైనికులు తీవ్రంగా గాయాలపాలవగా.. అందులో నలుగురు మృత్యువాత పడ్డారు. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో స్థానిక పోలీసులతో కలిసి జల్లెడ పడుతుండగా.. టెర్రరిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దాదాపు 20 నిమిషాల పాటు భీకర కాల్పులు జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ దాడికి పాల్పడింది తామేనంటూ జైషే మహమ్మద్ సారధ్యంలోని ‘కశ్మీర్ టైగర్స్’ ప్రకటించింది.

దోడా జిల్లా కేంద్రానికి 55కి.మీ దూరంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. జూలై 9న కథువా జిల్లాలో ఆర్మీ కాన్వాయ్‌పై కూడా కశ్మీర్ టైగర్స్ సంస్థే దాడి చేసింది. ఉపేంద్ర ద్వివేది కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు జమ్ములోని పరిస్థితిని ఫోన్‌లో వివరించారు. ఈ ఘటనను అనేక మంది రాజకీయ నాయకులు ఖండిస్తున్నారు. అమరులైన సైనికులకు సంతాపం తెలిపారు. కొన్ని సంవత్సరాల నుంచి పూంచ్, రాజౌరి జిల్లాల్లో ఉగ్రదాడులు జరగకుండా ఉండగా.. ప్రస్తుతం దాడులతో ఆ ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. 

వారంలో ఇది రెండోది.. 

పోయిన వారం జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఉగ్రదాడి జరగ్గా.. ఆ దాడిలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. ఆ ఘటనను మరువకముందే దోడా జిల్లాలో బలగాలపై విరుచుపడి.. నలుగురు జవాన్లను పొట్టన పెట్టుకున్నారు. కథువా ఘటనలో సైనికులు వెళ్తున్న కాన్వాయ్‌లను లక్ష్యంగా చేసుకున్న ముష్కరులు ఇక్కడ మాత్రం నేరుగా వారిమీదే కాల్పులు జరిపారు. జమ్ము రీజియన్‌లో గడిచిన 32 నెలలుగా 48 సైనికులు ఉగ్రవాదులతో పో రులో అమరులయ్యారు. 

ఎన్‌కౌంటర్ జరిగిందిలా.. 

దోడా జిల్లాలోని అడవిలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమచారం మేరకు రాష్ట్రీయ రైఫిల్స్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్‌కు చెందిన బలగాలు కూంబింగ్ చేపట్టేందుకు బయలుదేరాయి. దేసా ఫారెస్ట్ రీజియన్‌లో ఉన్న ధారి గోటె ఉరార్‌బాగి ప్రాంతంలో కూంబిం గ్ చేస్తుండగా.. ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. కాల్పులు జరుపుతూ.. వారు అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. ఆర్మీ దళాలు వారిని ప్రతిఘటించాయి. దీంతో అ క్కడ భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు జవాన్లు గాయపడగా.. నలుగురు ప్రాణాలు విడిచారు. చనిపోయిన వారిలో ఒక కెప్టెన్ స్థాయి అధికారి కూడా ఉన్నారు.  

మోదీజీ దేశం ఎదురుచూస్తోంది: రాహుల్ గాంధీ

ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన అమరసైనికులకు  రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. మోదీజీ మీ సమాధానం కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోందని అన్నారు. ఆయన తప్పనిసరిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదులు వరుస దాడులు చేస్తూ మన జవాన్ల ప్రాణాలను పొట్టనపెట్టుకుంటున్నారు. 

తల్లీ నీ త్యాగం మరువలేనిది.. 

అమరుడైన కెప్టెన్ బ్రిజేశ్ థాపా తల్లి ఆవేదన విన్న ప్రతి ఒక్కరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది. ఆయన తండ్రి కూడా ఆర్మీ అధికారే కావడం గమనార్హం. నా కొడుకు కండ్ల కు కనిపించడుగా.. సైనికుల్ని పొట్టనపెట్టుకున్న కీచకులను మట్టుబెట్టాలని ఆమె విలపిస్తున్న తీరు అక్కడి వారికి క న్నీళ్లు తెప్పిస్తోంది. బ్రిజేశ్ ఇంజనీరింగ్ చేసినా కానీ సైన్యంలో చేరాలనే పట్టుదలతో కలను నెరవేర్చుకున్నాడు. 27 సంవత్సరాల బ్రిజేశ్‌కు పెళ్లి చేద్దామని చూస్తుండగానే ఈ ఘోరం జరిగిపోయింది. 

ఉగ్రవాదుల ఉచ్చు.. 

దోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారని వచ్చిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన భద్రతా బలగాల మీద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. మన సైనికులను మట్టుబెట్టేందుకు ముందు వారు పక్కా ప్లాన్‌తో వ్యవహరించినట్లు తెలుస్తోంది. దోడా జిల్లాలోని ఓ అడవిలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో అక్కడకు వెళ్లిన భద్రతా బలగాల మీద నామమాత్రంగా కాల్పులు జరిపిన ముష్కరులు.. మన ఆర్మీ అధికారులు వారి వెంట వెళ్లేలా చేయడంలో సక్సెస్ అయ్యా రు. అలా ఉగ్రవాదులు కాల్పులు జరిపి వెళ్లడంతో ఎలాగైనా వారిని మట్టుబెట్టాలనే కృ త నిశ్చయంతో మన సైనికులు వెనకా ము ందు ఆలోచించకుండా వారిని వెంబడిస్తూ వెళ్లారు. కానీ అదే మన సైనికులను పొట్టనపెట్టుకుంది. మన సైనికులను ఒక ప్రాం తానికి తీసుకెళ్లి భీకర కాల్పులు జరిపారు. 

2024లో జరిగిన మేజర్ దాడులు.. 

మే 4: పూంచ్ జిల్లాలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సైనికుడితో పాటు మరికొంత మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 

జూన్ 9: ఉగ్రవాదుల దాడిలో 9మంది చనిపోగా.. 33 మంది గాయపడ్డారు. 

జూన్ 11: జంట దాడుల్లో ఆరుగురు జవాన్లను పొట్టన పెట్టుకున్నారు. 

జూలై 8: కాన్వాయ్ మీద జరిగిన దాడిలో ఐదుగురు జవాన్లు అమరులు కాగా.. మరో ఐదుగురు గాయపడ్డారు.

జూలై 16: దోడా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో 4 జవాన్లు అమరులయ్యారు.