calender_icon.png 28 November, 2024 | 8:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండుగలా గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం

15-10-2024 03:11:13 AM

  1. సినీ పరిశ్రమను రాష్ట్రప్రభుత్వం గౌరవిస్తుంది..
  2. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క 
  3. సచివాలయంలో గద్దర్ సినీ అవార్డుల కమిటీ మొదటి సమావేశం 

హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): రాష్ట్రప్రభుత్వం పండుగ వాతావర ణంలో గద్దర్ అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లోని సచివా లయంలో సోమవారం గద్దర్ సినీ అవార్డుల కమిటీ సభ్యులతో నిర్వహించిన మొదటి సమావేశంలో ఆయన మాట్లాడారు.

అవార్డుల ప్రదానోత్సవం ఏ తేదీన నిర్వహించా లనే అంశంపై కమిటీ కసరత్తు చేయాలని సూచించారు. మరికొద్దిరోజుల్లో మరోసారి కమిటీతో సమావేశం నిర్వహిస్తామన్నారు. తమ ప్రభుత్వం సినీ పరిశ్రమకు  ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ దేశాన్నే కాదు, ప్రపంచ సినిమానే శాసించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. 

సినీ పరిశ్రమ ఎలాంటి సమస్య ఎదుర్కొంటున్నా, వెంటనే తమను సంప్రదించవచ్చని సూచించారు. ఆయా సమస్యల పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారన్నారు. ఇదే విషయాన్ని కమిటీతో పంచుకోవడం ఆనందాన్నిచ్చిందన్నారు.

ఉమ్మడి పాలనలో నంది అవార్డుల ప్రదానోత్సవం పండుగ వాతావరణంలో జరిగేదని, రాష్ట్రవిభజన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం పదేళ్ల పాటు అధికారంలో ఉండి కూడా పట్టించుకోలేదని విమర్శించారు. కమిటీ సభ్యుడు, సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాన్సెప్ట్ అద్భుతంగా ఉందన్నారు.

ఆ స్కూళ్లలో విద్యార్థులకు యాక్టింగ్ నేర్పిస్తే బాగుంటుందని సూచించారు. అలాగే ఇతర సభ్యులు మాట్లాడుతూ.. స్కిల్ యూనివర్సిటీలోనూ యాక్టింగ్ స్కిల్స్ కోర్సెస్ ప్రవేశపెట్టాలని డిప్యూటీ సీఎంను కోరారు. వారి సూచనలపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు.

సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, కమిటీ సభ్యులు బీ నర్సింగరావు, తనికెళ్ల భరణి, సురేశ్‌బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, దిల్ రాజు, హరిశంకర్, వందేమాతరం శ్రీనివాస్, అల్లాణి శ్రీధర్,  గుమ్మడి విమల, సమాచార శాఖ కమిషనర్  హనుమంతరావు పాల్గొన్నారు.