నవమాసాలు కడుపున మోసి..
పొత్తిళ్లలోనే తల్లి గుండెలపై తన్ని..
ప్రసవంతో పునర్జన్మను పొంది..
శిశువుగా సకల సపర్యలు పొంది..
పాతికేళ్ల వరకు గారాబంగా పెరిగి
నడక, నడతలను నేర్చుకొని..
తమ కాళ్లమీద తాము నిలబడి..
అమ్మానాన్నల్ని గాలికి వదిలేసి..
సూటి పోటి మాటల బాణాలతో..
అయ్యవ్వల గుండెల్ని తూట్లు పొడిచి..
పట్టెడన్నానికి రాచి రంపాన పెట్టి..
ఆస్తిపాస్తుల్ని ఆసాంతం లాగేసుకొని..
చదువు సంస్కారాలను పాతరేసి..
కన్నోళ్ల కంటి కన్నీరు ఏరులై పారగా..
కర్కశంగా గడప ఆవలికి గెంటేసి..
బిడ్డల పెంచి పోషించిన పాపానికి..
అందరు ఉన్నా అనాథల్ని చేసి..
రేపు అనాథలం కావచ్చని మరిచి..
కన్న పాపానికి కసి తీసుకుంటూ..
అవుతున్నారు కసాయి కన్నబిడ్డలు!
కన్నోళ్లను కంటి పాపల్లా చూసుకుంటూ..
అమ్మను ఆదిదేవతగా పూజిస్తూ..
నాన్న గుండెల్లో గాయాల్ని దర్శిస్తూ..
మలిసంధ్య పండుటాకుల జంటను..
మదిలో ప్రతిష్ఠించుకొని ఆరాధిస్తూ..
అయ్యవ్వల అనుభవాలే పెట్టుబడిగా..
అమ్మనాన్నలే అసలైన ఆస్తిగా భావిస్తూ..
ఆదిదేవతల రుణం తీర్చుకుంటూ..
గృహాన్ని స్వర్గసీమగా మార్చుతూ..
రేపటి తరానికి దారిదీపంగా నిలుద్దాం
వారి ముఖాల్లో నవ్వుల పువ్వులు పూయిద్దాం!
9949700037
- మధుపాళీ