calender_icon.png 23 October, 2024 | 9:00 PM

బోనాల వెభవం

10-07-2024 05:16:04 AM

బోనం అనగానే గుర్తొచ్చేది.. బెల్లమన్నం.. పచ్చిపులుసు.. వేపాకు రెమ్మలు, పసుపు, కుంకుమ యాదికొస్తది.  ఇంకా భాగ్యనగరం వీధుల్లో డప్పు చప్పుళ్లు.. పోతురాజు విన్యాసాలు.. అమ్మవారికి తొట్టెల, ఒడి బియ్యం, తొలి బోనం సమర్పణ, ఫలహార బండ్ల ఊరేగింపులు, రంగం, బలిగంప, నిమర్జణంతో ముగుస్తుంది. బోనాల జాతరలో ముఖ్యంగా మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ గుళ్లను దేదీప్యమానంగా అలంకరిస్తారు.

ఆషాఢ మాసంలో మహిళలు.. చేతి నిండా గాజులతో.. నుదిటిపై పెద్దబొట్టుతో.. మహాలక్ష్మిలా బోనం తలపై ఎత్తుకొని అమ్మబైలెల్లినాదో అంటూ అమ్మవారికి భక్తులు చీర, సారెలు, నైవేద్యాలు సమర్పిస్తుంటారు. ఇది  తెలంగాణ సంప్రదాయంలో, సంస్కృతిలో తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. బోనాల ఉత్సవాల్లో ఏమేం చేస్తారు.. ఎన్ని ఘట్టాలున్నాయి.. బోనం సమర్పించడం మొదలు.. రంగం.. నిమజ్జనం వరకు ఏ ఘట్టంలో ఏం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..

కాకతీయుల కాలం నుంచే బోనాల వేడుకలు ఉన్నట్టు తెలుస్తోంది. కాకతి దేవత ఎదుట అన్నాన్ని కుంభంగా పోసి సర్పించేవారు. అనంతరం గోల్కొండ నవాబుల కాలంలో ఈ ఉత్సవాలు ప్రసిద్ధి చెందాయి. హైదరాబాద్ నగరంలోని గోల్కొండ కోటలోని జగదాంబ మహంకాళి ఆలయంలో ఆషాఢ మాసం మొదటి గురువారంతో వేడుకలు ప్రారంభమవుతాయి. ఆషాఢమాసమంతా ప్రతి గురు, ఆదివారాలు మహంకాళి ఆలయంలో బోనాలు నిర్వహిస్తారు. ఇది సమైక్య జీవనానికి ప్రతీకగా నిలుస్తుంది. అత్యంత మహత్యమైన వేడుకైన బోనాల పండుగ పరంపరలో చోటుచేసుకునే ఘట్టాలు మనందరినీ భక్తి పారవశ్యంలో ముంచేస్తాయి. 

ఇది పల్లె ప్రజల పండుగ. ఓ రకంగా ప్రకృతిని ప్రేమించే పండుగ. తమ పంటలను కాపాడుతున్న గ్రామ దేవతకు భక్తి పూర్వకంగా సమర్పించుకునే భోజనమే బోనం. ముందుగా ఆ బోనాన్ని ఒక మట్టి కుండలో వండుతారు. అలా వండిన కుండకి సున్నం, పసుపు, కుంకుమరుద్ది, వేపాకులు కూడా కడతారు. అలాగే ఆ కుండ పై ఒక దీపాన్ని ఉంచుతారు. ఇలా వండిన బోనం ఎంత పవిత్ర మైందంటే అంతే శుభప్రదమైనది కూడా.. అలా వండిన బోనానికి సున్నం, పసుపు, వేపాకులు పెట్టడం వలన ఎటువంటి క్రిమి, కీటకాలు దరిచేరకుండా చేస్తాయి. ఇందులో వాడిన సున్నం, పసుపు, వేపాకులు ఇవ్వాన్ని యాంటీ సెప్టిక్, యాంటీ బైయోటిక్‌కు సంబంధించి నవే కాబట్టి.. దీని వెనుక శాస్త్రీయం కూడా జోడించారు. అలాగే బోనం పై దీపం ఎందుకు పెడతారంటే ఒకవేళ మనం బోనం ఎత్తుకొని వెళ్లే దారి కనుక చీకటిగా ఉంటే అప్పుడు  ఆ దీపమే దారి చూపిస్తుందని పెద్దల భావన.  

ఘటోత్సవం.. 

ప్రత్యేకమైన ఘటం (కలశం)లో అమ్మవారిని ఆవాహన చేసి ఊరేగింపుగా తీసుకెళతారు. బోనాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి పద్నాలుగో రోజు వరకూ ప్రతి రోజూ రెండు పూటలా అమ్మవారు కలశం రూపంలో నగరాల్లో, ఊర్లలో తిరుగుతూ భక్తుల నుంచి పూజలందుకుంటుంది. ఘటం అంటే కలశం, నగరవీధుల గుండా ఊరే గింపుగా తీసుకెళతారు. ఈ ఘటంపై అమ్మవారి రూపాన్ని చిత్రీకరిస్తారు. ఆలయ పూజారి ఒళ్లంతా పసుపు పూసుకుని ఘటాన్ని ఊరేగిస్తారు. 

బోనాలు..

బోనం అంటే భోజనం.. అనుక్షణం కాపాడే శక్తి స్వరూపిణికి కృతజ్ఞతా పూర్వకంగా సమర్పించే ఆహారం. ఎవరెవరు ఎలాంటి మొక్కులు తీర్చుకుంటామని మొక్కుకున్నారో అవన్నీ అమ్మకు చెల్లిస్తారు. ముఖ్యంగా చక్కెరపొంగలి, బెల్లపు పొంగలి, కట్టెపొంగలి, పసుపు అన్నం ఇలా వివిధ రకాల ఆహారాన్ని సమర్పిస్తారు. ఇల్లు వాకిలి శుభ్ర చేసి, తల స్నానం ఆచరించి, నూతన వస్త్రాలు ధరించి నైవేద్యం తయారు చేస్తారు. పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించిన పాత్రలో అన్నాన్ని ఉంచి దానిపై మూతపెట్టి దీపం వెలిగించి.. గుంపుగా వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు. 

పోతురాజు వీరంగం..

పోతురాజు అంటే ఏడుగురు అమ్మవార్లకు సోదరుడు. బోనాలు పండుగలో పోతురాజులే ప్రత్యేక ఆకర్షణ. ప్రతి బస్తీ నుంచి పోతురాజు అమ్మవారి ఆలయం వరకూ విన్యాసాలు చేసుకుంటూ వెళతాడు. కాళ్లకు గజ్జెలుకట్టి, ఒళ్లంతా పసుపు పూసుకుని, పసుపు నీటిలో ముంచిన ఎర్రటి వస్త్రాన్ని ధరించి.. కళ్లకు కాటుక, కుంకుమతో పెద్ద బొట్టు, నడుముకు వేపాకు చుట్టి.. పసుపు రంగు కొరడా ఝుళిపించి నాట్యం చేస్తూ ఫలహారం బండి ముందు నడుస్తాడు. పోతురాజు కొరడాతో బాదుకొంటూ.. వేపాకులను నడుముకు చుట్టుకొని అమ్మవారి పూనకంలో ఉన్న భక్తురాండ్రను ఆలయంలోని అమ్మవారి సమక్షానికి తీసుకెళతాడు.

పోతురాజు వేషం వేసిన వ్యక్తికి కూడా పూనకం వస్తుంది. ఆ విక్రుతమైన కోపాన్ని తగ్గించేందుకు అక్కడ ఉన్న భక్తులు కొమ్ములు తిరిగిన మేకపోతును అందిస్తారు. పోతురాజు తన దంతాలతో ఆ మేకపోతును కొరికి, తల, మోండెం వేరు చేసి పైకి ఎగురవేస్తాడు దీన్నే గావు పట్టడం అని పేర్కొంటారు. ఈ కార్యక్రమం జాతర ఊరేగింపు తర్వాత జరుగుతుంది.

వేపాకు సమర్పించడం..

సర్వ రోగనివారిని అయిన వేపాకులను ఎన్నో ఔషధ గుణాలున్న పసుపు నీటిలో ముంచి అమ్మవారికి సమర్పించే ఆచారాన్నే వేపాకు సమర్పించడం అంటారు. వానాకాలం మొదలైన సందర్భంగా వ్యాపించే క్రిమికీటకాలను తరిమికొట్టేందుకు క్రిమినాశినిగా వేపాకు ఉపయోగపడుతుంది. పైగా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన వృక్షం కూడా ఇదే.

రంగం..

బోనాలలో చివరి రోజు జరిగే ముఖ్యమైన ఘట్టం రంగం. అమ్మవారి సన్నిధికి ఎదురుగా ముఖమంటపంలో ఉన్న మాతంగీశ్వరి ఆలయంలో అమ్మవారికి ఎదురుగా ఓ స్త్రీ మట్టి కుండ మీద నిలబడి భవిష్యవాణి చెబుతుంది. దేశ రాజకీయం, వ్యవసాయం, వ్యాధులు, ప్రకృతి వైపరీత్యాల గురించి అమ్మవారు భవిష్యవాణి చెబుతుంది. భవిష్యవాణి చెప్పే స్త్రీ పూనకం నుంచి సాధారణ స్థితికి తీసుకురావడానికి సొరకాయ, గుమ్మడికాయలను బలి ఇచ్చి పూనకం విరమింపచేస్తారు. దీంతో ప్రధాన జాతర ముగుస్తుంది. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మధ్యాహ్నం తర్వాత అమ్మవారిని దేవాలయం నుంచి సికింద్రాబాద్ పొలిమేర మెట్టుగూడ వరకూ సాగనంపటంతో సిక్రింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర ముగుస్తుంది. 

బలి..

రంగం ముగిసిన మర్నాడు పోతురాజులు అమ్మవారి సన్నిధిలో భక్తితో తాండవం చేస్తాడు. ఆ సందర్భంలో సొరకాయ, ఎర్ర గుమ్మడికాయ వంటి వాటిని పగుల గొట్టి అమ్మవారికి బలి ఇస్తారు. అప్పట్లో జంతువులను బలిచ్చేవారు. 

సాగనంపుట..

బలిచ్చే కార్యక్రమం అయిపోయిన తర్వాత అమ్మవారి చిత్రపటాన్ని అలంకరించి ఏనుగుపై ఎక్కించి మంగళ వాయిద్యాల మధ్య ఊరేగించి నిమజ్జనం చేస్తారు.