calender_icon.png 18 January, 2025 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాసంగిలో ఎరువుల కొరత

18-01-2025 12:51:28 AM

* ఆగ్రో కేంద్రాలకు కేటాయింపులపై కత్తెర

* కృత్రిమ కొరతతో అధిక ధరలు

నిర్మల్, జనవరి 1౭ (విజయక్రాంతి): యాసంగిలో పంటలు సాగు చేస్తున్న రైతులను ఎరువుల కొరత వేధిస్తున్నది. దీంతో పంటల ఎదుగుదలపై ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ జిల్లాలో యాసంగిలో 2.80 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ప్రధానంగా మొక్కజొన్న, వరి, వేరుశనగ, పొద్దు తిరుగుడు, నువ్వులు, జొన్న తదితర పంటలు ఉన్నారు. పంటలు ప్రస్తుతం ఎదుగుదల దశలో ఉన్నాయి.

వీటికి తప్పనిసరిగా యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులు అయిన డీఏపీ, పొటాష్, సూపర్ పాస్పేట్ ఎరువుల అవసరం ఉంటుంది. కానీ ఎరువులు దొరకడంలేదని రైతులు వాపోతున్నారు. 72,600 మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరం ఉంటుందని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఇందులో 32,400 వరకు యూరియా (నత్రజని) ఎరువులు కాగా మిగితావి కాంప్లెక్స్ ఎరువులు.

వ్యవసాయ శాఖ మార్క్‌ఫెడ్ ద్వారా జిల్లాలోని ప్రభుత్వ మార్కెటింగ్ సంస్థలైన ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘాలు, డీసీఎంఎస్ సంఘాలకు 50 శాతం, మిగితా 50 శాతం ఆగ్రోస్ ప్రైవేటు ఎరువుల దుకానాలకు సరపరా చేయాలి. అయితే ప్రతి నెల రైతుల డిమాండ్‌ను బట్టి వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం ఎరువులు ప్రభుత్వం జిల్లాకు సరఫరా చేస్తుంది. అయితే జిల్లాకు డిమాండ్‌కు తగ్గ   ఎరువులు సరఫరా కావడం లేదని రైతులు పేర్కొంటున్నారు.

వచ్చిన ఎరువులు కూడా మార్క్‌ఫెడ్, పీఏసీఎస్ సంఘాలకు మాత్రమే కేటాయిం  ఆగ్రోస్ ఏజెన్సీలకు ప్రైవేటు వ్యాపారస్తులకు ఎరువుల సరఫరాల్లో కోతలు పెట్టడంతో ఎరువుల కొరత ఏర్పడుతోంది. జిల్లా వ్యాప్తంగా 24 ఆగ్రోస్ కేంద్రాలు ఉండగా వాటికి ఎరువుల సరఫరా లేక వ్యాపారం చేయలేని దుస్థితి ఏర్పడిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొద్దిపాటి ఎరువుల ఇస్తున్నా వాటికి ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. రైతుల డిమాండ్ ఉన్న కంపెనీల బ్రాండ్ ఎరువులు దొరుకకపోవడంతో ఇతర కంపెనీ ఎరువులు తీసుకుంటేనే బ్రాండ్ కంపెనీకి చెందిన ఎరువులు ఇస్తున్నారు. కాంప్లెక్స్ ఎరువులతో లింక్ పెట్టడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. డీఏపీ కొరత కూడా ఉన్నదని రైతులు వాపోతున్నారు. 

అధిక ధరకు విక్రయం

ప్రస్తుతం మార్కెట్‌లో యూరియా బస్తా ధర రూ.266 కాగా కొందరు రూ.300 వరకు విక్రయిస్తున్నారు. కాంప్లెక్స్ ఎరువులైన 20,20 రూ.1,200 ఉండగా రూ.1,300లకు అమ్ముతున్నారు. డీఏపీ రూ.1,350 ఉండగా అదనంగా రూ.50 వసూలు చేస్తున్నారు. ఇతర ఎరువులు అయిన సూపర్, ఎంవోపీ, 14.35.14, 28.28.0, 10.26.26 ఎరువులు ఉన్న ధరకంటే రూ.20 ఎక్కువకు అమ్ముతున్నారు.

అధిక ధరపై రైతులు అడిగితే ఎరువులు లేవని వేధిస్తున్నట్టు తెలిపారు. రైతులు పట్టా పాసు పుస్తకంతో ఈ విధానంలో ఎరువులు ఇవ్వాలని వ్యవసాయ శాఖ ఆదేశించినా వ్యపారులు కృత్రిమ కొరత చూపి అధిక ధరలకు అమ్ముతున్నారు. రైతులకు ఇచ్చే రసీదు ప్రభుత్వ ధరతోనే ఇస్తున్నారు. 

పంట దిగుబడులపై ప్రభావం

పంట ఎదుగుదల దశలో అవసరమైన ఎరువులు దొరకకపోవడంతో పంట దిగుబడులపై ప్రభావం ఉంటుందని రైతులు వాపోతున్నారు. వరినాటుతో పాటు మొక్కజొన్న, వేరుశనగ, పొద్దుతిరుగడు, జొన్న పంటలకు తప్పనిసరిగా రసాయన ఎరువులు వాడాలి. విత్తనంను మొదలుకొని పంట చేతికి వచ్చే వరకు నాలుగు విడతలుగా ఎరువులు వేయాలి.

ప్రస్తుతం ఆరుతడి పంటలు ఎదిగి, పూత కంకుల దశలో ఉన్నాయి. ఈ దశలో ఎరువులు తగిన మోతాదులో వాడితేనే గింజలు ఏర్పడి అవి నిండుగా కాసే అవకాశం ఉంది. లేదంటే ఎదుగుదల నిలిచిపోయి పంట దిగుబడులు తగ్గుతాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ శాఖ మాత్రం రైతుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఎరువుల కొరత రాకుండా ప్రభుత్వంతో సంప్రదింపులు చేసున్నట్టు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.