calender_icon.png 18 October, 2024 | 6:49 PM

ఆగ్రోస్ ద్వారా ఎరువుల పంపిణీ

18-10-2024 01:32:24 AM

  1. యాసంగి నుంచి అందించేందుకు ఏర్పాట్లు
  2. ప్రభుత్వ అనుమతి రాగానే విక్రయాలు
  3. కంపెనీల నుంచి తీసుకొని నేరుగా రైతులకు 
  4. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు ప్రయత్నాలు

హైదరాబాద్, అక్టోబర్ 1౭ (విజయక్రాంతి): రైతులకు ఎరువుల కొరత లేకుండా, బ్లాక్ మార్కెట్‌లో అమ్మకాలు జరగకుండా ఉండేందుకు యాసంగి నుంచి మార్క్‌ఫెడ్‌తో పాటు ఆగ్రోస్ కేంద్రాల ద్వా రా ఎరువులు రైతులకు అందించే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది.

పంటల సీజ న్‌లో ప్రైవేటు దుకాణాదారులు ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి రైతులను నిలువునా దోచుకుంటున్నారు. ఎరువుల అమ్మకాలపై వ్యవసాయ అధికారులకు ఏటా పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో దుకాణాలపై దాడులు చేసి సీజ్ చేస్తున్నారు.

అయినా షా పు యజమానులు బ్లాక్ మార్కెట్‌లో ఎరువులు అమ్ముతున్నారు. వీరి అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం మరో ఏజెన్సీగా ఆగ్రోస్‌ను రంగంలోకి దించునుంది. 

ఏటా 35 లక్షల టన్నుల ఎరువులు..

 రాష్ట్రంలో ఏటా వానాకాలం, యాసంగి పంట సీజన్లకు 35 లక్షల టన్నుల ఎరువులను (డీఏపీ, కాంప్లెక్స్, పొటాష్) ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. నోడల్ ఏజెన్సీగా ఉన్న మార్క్‌ఫెడ్ ఎరువుల కంపెనీలనుంచి తెచ్చి గోదాముల్లో నిల్వచేసి జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల, ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల ద్వారా రైతులకు అందిస్తుంది.

రాష్ట్ర వ్యాప్తంగా 980 ఆగ్రోస్ కేంద్రాలు ఉండగా ప్రస్తుతం 395 కేంద్రాలు ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఇటీవల ఆగ్రోస్ ఉన్నతాధికారులు ఎరువుల పంపిణీకి తమ సంస్థను నోడల్ ఏజెన్సీగా నియమించాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై మంత్రి తుమ్మల స్పందించి ప్రతిపాదనలు రూపొందించాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికా రు లను ఆదేశించారు.

ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన తరువాత కొత్తగా మరో ఏజెన్సీగా ఆగ్రోస్ ఎరువుల పంపిణీ చేస్తుంది. ఎంపిక చేసిన తరువాత రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు కేంద్ర ఎరువుల మంత్రిత్వశాఖకు, ఎరువుల కంపెనీలకు సమాచారం అందిస్తారు. దీంతో ఎరువుల కంపెనీలు మార్క్‌ఫెడ్‌తో పాటు ఆగ్రోస్‌కు నేరుగా ఎరువులను సరఫరా చేస్తాయి. 

సకాలంలో రైతులకు..

ప్రస్తుతం ప్రభుత్వం ఆధ్వర్యంలో 925 సహకార సంఘాలు, 395 ఆగ్రోస్ కేంద్రాల ద్వారా ఎరువులు అమ్ముతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో ౬వేల ప్రైవేటు ఎరువుల దుకాణాలు ఉన్నాయి. ప్రభుత్వ కేంద్రాల్లో ఎరువులు సకాలంలో దొరకక  రైతులు ప్రైవేటు దుకాణాల వద్దకు వెళుతున్నారు. ఆగ్రోస్ కూడా ఎరువులను సరఫరా చేస్తే రైతులకు బ్లాక్ మార్కెట్ సమస్యలు తప్పడంతో పాటు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే సకాలంలో దొరుకుతాయి.