calender_icon.png 11 January, 2025 | 8:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంతానోత్పత్తి..సమస్యలా!

14-12-2024 12:00:00 AM

మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వ్యసనాలు, ఆరోగ్య సమస్యల కారణంగా.. అనేక జంటల్లో సంతానలేమి ప్రధాన సమస్యగా మారింది. ప్రపంచవ్యాప్తంగా 15% మంది సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారు. ‘వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్’ ప్రకారం భారతదేశంలో 10% నుంచి 16.8% ఈ సమస్యతో సతమతమవుతున్నారు. అసలు సంతానోత్పత్తి రేటు తగ్గుదలకు కారణాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సంతానం కలుగుతుందో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

ఎయిమ్స్ నివేదిక ప్రకారం దాదాపు పది నుంచి 15 శాతం భారతీయ జంటలు వంధ్యత్వంతో పోరాడుతున్నారు. వైద్యపరంగా చెప్పాలంటే ఓ జంట సంతానం కావాలని ప్రయత్నించినా గర్భం దాల్చేందుకు సంవత్సరం కంటే ఎక్కువ సమయమే పడుతుంది. తాజాగా గణాంకాల ప్రకారం మన దేశంలోని సుమారు 27.5 మిలియన్ల జంటలు సంతానలేమితో బాధపడుతున్నట్లు సమాచారం.

దీనికి భార్యాభర్తలు ఇద్దరిలో ఉన్న అనేక ఆరోగ్య సమస్యలు, అలవాట్లు కారణమవుతున్నాయి. పెళ్లి తర్వాత కెరీర్ కోసం పిల్లల్ని కనేందుకు ఆలస్యం చేసే కొన్ని జంటల్లో పునరుత్పత్తి సమస్యలు తలెత్తి గర్భధారణ కష్టమవుతోంది.  గర్భధారణ ఆలస్యం చేసే వారిలో 54శాతం మంది సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు పలు పరిశోధనల్లో తేలింది. 

సంతానోత్పత్తి రేటు తగ్గుదల..

ఒక మహిళ 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల మధ్య వయసులో జన్మనిచ్చే పిల్లల సంఖ్య సగటును సంతానోత్పత్తి రేటుగా లెక్కిస్తారు. 1950లో దేశంలో సంతానోత్పత్తి రేటు 6.18గా ఉండేది. అధిక జనాభా కారణంగా ఆహార కొరత వంటి సమస్యలు తలెత్తడంతో 1951 నుంచి కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేశారు. ఇద్దరిని మించి కనవద్దని అవగాహన కల్పించారు.

దీంతో క్రమంగా సంతానోత్పత్తి రేటు తగ్గుతూ వచ్చింది. ఈ తగ్గుదల మరీ ఎక్కువ కావడమే ఇప్పుడు సమస్యగా మారింది. జనాభా తగ్గొద్దంటే సంతానోత్పత్తి 2.1గా ఉండాలి. మనదేశంలో సంతానోత్పత్తి రేటు వేగంగా దిగువకు పడిపోతున్నది. 2019 దేశంలో సంతానోత్పత్తి రేటు 2.0తో రీప్లేస్‌మెంట్ స్థాయికి దిగువకు తగ్గినట్టు కేంద్రం వెల్లడించింది. 

కారణాలివే..

భార్యాభర్తల్లో సుమారు 40 శాతం మంది పురుషుల్లో, 40 శాతం మంది మహిళల్లో ఉన్న అనారోగ్య కారణాల వల్ల పిల్లలు కలగడం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మహిళల్లో వయసు పెరిగేకొద్దీ గర్భధారణకు సంబంధించి సమస్యలు పెరుగుతూ ఉంటాయి. వారి శరీరం పిల్లల్ని కనేందుకు సహకరించదు. డయాబెటిస్, థైరాయిడ్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, ఎండోమెట్రియోసిస్, ఫెలోపియన్ ట్యూబుల్లో అడ్డంకులు వల్ల మహిళల్లో సంతానోత్పత్తి సమస్యలు తలెత్తుతున్నాయి.

వీటి వల్ల పీరియడ్స్ ఆలస్యం కావడం, అండం విడుదలలో అడ్డంకులు, కటి భాగంలో నొప్పి వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అలాగే పురుషుల్లో తక్కువ స్పెర్మ్ కౌంట్, శుక్ర కణాల నాణ్యత తగ్గడం, అవి చలించే వేగం తక్కువగా ఉండటం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. ఇవేకాకుండా అంగస్తంభన, వృషణాలలో నొప్పి లేదా వాపు, వీర్య సమస్యలు వంటివి కనిపిస్తాయి. అధిక బరువు, ధూమపానం, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. కొందరు పురుషుల్లో లైంగిక ఆసక్తి తక్కువగా ఉండటం కూడా సంతానలేమి సమస్యకు కారణం అవుతుంది. 

ఆసక్తి లేకపోవడం.. 

పురుషుల్లో లైంగిక కోరికలు బాగుండాలంటే టెస్టోస్టిరోన్ లెవెల్స్ తగినంతంగా ఉండాలి. పురుషుల్లో ఇది ముఖ్యమైన హార్మోన్. ఇది వృషణాల్లో ఉత్పత్తి అవుతుంది. ఇది కౌమార దశలో ఉత్పత్తి అవడం ప్రారంభమై వయసు పెరుగుతున్న కొద్దీ తగ్గుతుంటుంది. స్పెర్మ్ ఉత్పత్తిలో, ఎముకలు, కండరాల ఆరోగ్యంలో, ఎర్రరక్త కణాల ఉత్పత్తిపై, పురుషుడి మానసిక స్థితిపై ఇది ప్రభావం చూపుతుంది. అయితే కొన్ని కారణాలతో పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయులు తగ్గుతాయి.

దీనివల్ల చిరాకు, మూడ్ మారిపోవడం, శృంగారంపై ఆసక్తి తగ్గడం, నిస్సత్తువ, ఆందోళన, ఏకాగ్రత లోపించడం, నిద్ర సరిగా పట్టకపోవడం వంటివి కనిపిస్తుంటాయి. పురుషుల్లో టెస్లోస్టిరాన్ తగ్గడానికి ఆహారపు అలవాట్లు, చెడు వ్యసనాలే ఎక్కువ కారణం. ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తినడం, చక్కెర, వేయించిన ఆహారాలు, ఆల్కహాల్ అతిగా తీసుకోవడం వల్ల టెస్టోస్టిరాన్ స్థాయి తగ్గే అవకాశం ఉంది.

సోయా, అవిసె గింజలను ఎక్కువగా తీసుకున్నా దీని స్థాయిపై ప్రభావం పడుతుంది. అలాగే సరైన నిద్ర లేకపోవడం కూడా టెస్టోస్టిరాన్ స్థాయిని తగ్గిస్తుంది. హైబీపీ, అధిక బరువు, అధిక కొలెస్ట్రాల్ కూడా టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయిని ప్రభావితం చేస్తుంది.

జాగ్రత్తలు..

* ధూమపానం, పొగాకు సంబంధిత పదార్థాలు తీసుకోవడం వల్ల అవి సంతానో త్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఆడ, మగ ఇద్దరికీ రిస్కే. అందుకే ఈ వ్యసనానికి దూరంగా ఉండాలి. 

* అధిక బరువు కూడా సంతానలేమికి కార ణం. ఇది స్త్రీలలో అండం విడుదల, హార్మోన్ల నియంత్రణని కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే తిండి విష యంలో జాగ్రత్త వహించాలి. వ్యాయామంపై     దృష్టి పెట్టాలి. 

* థైరాయిడ్ సమస్య ఉంటే ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుని అవసరమైన మందులు వాడాలి. 

* పిల్లల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఒత్తిడి కారణంగా పిల్లలు పుట్టడం లేదని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఈ సమస్య ఉంటే తగిన ట్రీట్‌మెంట్                  తీసుకోవాలి. 

* మద్యపానం సంతానోత్పత్తిపై హానికర ప్రభావాన్ని చూపుతుంది. ఆల్కహాల్ జోలికి వెళ్లవద్దు. 

* ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు తాజా ఆహారం, ఇంట్లో వండిన వంటలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, తాజా కూరగాయలు తీసుకోవడం ఉత్తమం. జంక్ ఫుడ్ జోలికి పోవొద్దు. రోజుకు గంటపాటు                       వ్యాయామం చేయాలి.