01-04-2025 01:17:46 AM
చర్ల, జనగామ, 31 (విజయక్రాంతి): ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్‌లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ (డీకేఎస్‌జడ్‌సీ) సభ్యురాలు రేణుక అలియాస్ దమయంతి అలియాస్ భాను ప్రాణాలు కోల్పోయింది. మృతి చెందిన మహిళా మావోయిస్టుది ఉమ్మడి వరంగల్‌లోని జనగామ జిల్లా.
భద్రతా దళాలు, డీఆర్‌జీ పోలీసులు యాంటీమావోయిస్టు ఆపరేషన్ నిర్వహిస్తుండగా.. మావో యిస్టులు సిబ్బందికి కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురు కాల్పుల్లో చనిపోయిన మహిళా మావోయిస్టు తల మీద ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. కోటి రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది.
సంఘటనా స్థలం నుంచి, మృ తదేహంతో పాటు ఇన్సాస్ రైఫిల్, మందుగుండు సామగ్రి, రోజువారీగా ఉపయోగించే వస్తువులను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎదురుకాల్పుల్లో మృతి చెందిన రేణుక 35 ఏండ్ల కిందట దళంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఆమె మృతిని ఎస్పీ గౌరవ్ రాయ్ ధ్రువీకరించారు. న్యాయశాస్త్రంలో పట్టా పొందిన రేణుక తిరుపతిలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ, మహిళా సంఘంలో కూడా చురుగ్గా పాల్గొనేది.
మాజీ హోం మంత్రిని మట్టుబెట్టిన రేణుక!
ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు నాయకురాలు రేణుక భువనగిరి ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి మాధవ రెడ్డి హత్యకు వ్యూహరచన చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. మావోయిస్టు అగ్రనేత పటేల్ సుధాకర్ రెడ్డితో కలిసి ఆనాటి దాడి లో ప్రధానపాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ఘట్కేసర్ బ్రిడ్జిపై మందుపాతర పేల్చి మా వోయిస్టులు మాధవ రెడ్డిని బలిగొన్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబా బు మీద అలిపిరిలో జరిగిన దాడి అనంతరం రేణుక మావోయిస్టు పార్టీలోకి పూర్తి స్థాయి కార్యకర్తగా వెళ్లినట్టు సమాచారం. మావోయిస్టు పార్టీలోకి వెళ్లిన అనంతరం ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డిని వివాహం చేసుకున్న రేణుక..
సంతోష్ రెడ్డి ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టు నేత శాఖమూరి అప్పారావు సహచరిగా కొనసాగుతూ విప్లవోద్యమంలో స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మావోయిస్టు పత్రిక ప్రభాత్‌కు ఆమె సంపా దకురాలిగా కూడా చేశారు. అంతే కాకుండా 2020 లో సెంట్రల్ రీజనల్ బ్యూరో ప్రెస్ టీమ్ ఇంచార్జిగా కూడా విధులు నిర్వర్తించారు.
2010లో నల్లమల అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అప్పారావు మరణించాడు. రేణు క తండ్రి సోమయ్య ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. రేణుకకు ఇద్దరు సోదరులు ఉన్నారు ఒక సోదరుడు రాజశేఖర్ న్యాయవాదిగా పనిచేస్తూ ఒక స్వచ్ఛంద సంస్థకు లీగల్ అడ్వైజర్‌గా కొనసాగుతున్నట్టు సమాచారం.
మరొక సోదరుడు వెంకట కిషన్ ప్రసాద్ ఢిల్లీలో బీబీసీ (తెలుగు) జర్నలిస్టుగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో ఇతను కూడా మావోయిస్టు అగ్రనేతగా పనిచేసి.. అనారోగ్య కారణాల వల్ల ప్రభుత్వానికి లొంగిపోయినట్లు వినికిడి. కడవెండి గ్రామం అంటేనే రజాకార్లకు సైతం గుండెల్లో వణుకు పుట్టించిన గ్రామంగా.. విప్లవాల ఖిప్లవాల పేరొందింది.