గమనించి ఆసుపత్రికి తరలించిన తోటి సిబ్బంది
ఎస్సై వేధిస్తున్నాడని సూసైడ్ నోట్
మెదక్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): మెదక్ జిల్లా చిలప్‌చేడ్ పోలీస్ స్టేషన్‌లో మహిళా ఏఎస్సై ఆత్మహత్యాయత్నం ఘటన కలకలం రేపింది. ఏఎస్సై సుధారాణి బుధవారం రాత్రి పోలీస్ స్టేషన్‌లోనే ఉరేసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. తోటి సిబ్బంది గమనించి ఆమెను జోగిపేటలోని ఓ ఆసుపత్రికి తరలించగా, చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఎస్సై యాదగిరి తనను మానసికంగా వేధిస్తూ లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఏఎస్సై తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. ఈ విషయంపై ఎస్సైని వివరణ కోరగా.. ఆమెకు భర్తతో కలహాలు ఉన్నా యని, ఆ కారణాలతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉండొచ్చని, తాను ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని తెలిపారు.
కాగా, ఎస్సై యాదగిరి చెప్పిన ప్రకారం కుటుంబ కలహాలే కారణమైతే పోలీస్ స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నం చేయాల్సిన అవసరం ఏముందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఎస్సై నిజంగానే వేధింపులకు గురిచేస్తే ఆమె ఉన్నతాధికారులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఏదేమైనా ఉన్నతాధికారుల విచారణలో అసలు నిజాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు. కాగా, ఏఎస్సైని ఎస్సై వేధింపులకు గురిచేసినట్లు రుజువైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన పోలీస్ స్టేషన్‌లో విచారణ చేపట్టి మీడియాతో మాట్లాడారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఘటనపై పూర్తి దర్యాప్తు చేసి పై అధికారులకు నివేదిక ఇస్తామని వెల్లడించారు.