calender_icon.png 2 January, 2025 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీజులు ఫుల్.. వసతులు నిల్

04-08-2024 03:17:31 AM

  • నిరుద్యోగులే టార్గెట్

కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల ఇష్టారాజ్యం

చిలువేరు శ్రీకాంత్

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 3 (విజయక్రాంతి) : తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి ఉద్యోగార్థులు హైదరా బాద్ వస్తుంటారు. ఆ ఉద్యోగార్థులే టార్గెట్‌గా నగరంలోని కోచింగ్ సెంటర్లు తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. కోచింగ్ సెంటర్ల పేరిట ఏటా రూ.రెండు వందల కోట్ల దందా జరుగుతున్నట్లు స్వయాన సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. కాగా గ్రూప్స్, యూపీఎస్సీ కోచింగ్ పేరిట రూ.30వేల నుంచి రూ.2లక్షల వరకు ఫీజులు వసూలుచేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తు న్నాయి.

ఉద్యోగం కోసం సిద్ధమయ్యే అభ్యర్థులు కోచింగ్, హాస్టల్, స్టడీరూం పేరిట నెలకు కనీసం రూ.10 నుంచి 30వేలు వెచ్చించాల్సి వస్తోంది. అయితే వాటిలో కనీస వసతులు కూడా ఉండవని పలువురు అభ్యర్థులు వాపోతు న్నారు. ఇటీవల ఢిల్లీలో వరదల కారణంగా అక్కడి రావూస్ కోచింగ్ సెంటర్ లో ముగ్గురు విద్యార్థులు చనిపోగా.. గతంలో అహ్మదాబాద్‌లోని ఒక కోచిం గ్‌సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో  పలువురు ఉద్యోగార్థులు చనిపోయిన విషయం తెలిసిందే. నగరంలోని పలు కోచింగ్ సెంటర్లలో కనీస నిబంధనలు పాటించకపోవడం, ఫైర్‌సేఫ్టీ లేకపోవడం, ముందస్తు చర్యలు తీసుకోకపోవ డంతో కోచింగ్ సెంటర్లలోని అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నది.

ఇరుకు గదులు.. అరకొర వసతులు 

తెలంగాణ, ఏపీల్లో గ్రూప్ 1, 2, 3 పరీక్షలతో పాటు పలు పోటీ పరీక్షలు జరుగబోతున్నాయి. దానికి తోడు యూ పీఎస్సీ, వివిధ డిపార్ట్‌మెంట్‌ల పరీక్షలు కూడా సమీపిస్తున్నాయి. ఈ పరీక్షలకు సిద్ధమయ్యే ఉద్యోగార్థులు నగరానికి భారీగా చేరుకున్నారు. అశోక్‌నగర్, అమీర్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, ఎస్‌ఆర్‌నగర్, కూకట్‌పల్లి, ఈసీఐఎల్ ప్రాంతాల్లో వందల సంఖ్యలో కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల్లో ఇన్‌స్టిట్యూట్‌లను నిర్వహిస్తున్నారు. మెజార్టీ కోచింగ్ సెంటర్లలో కనీసం తరగతి గదులు కూడా సరిగా లేవు. వెంటిలేషన్ కూడా సరిగాలేని ఇరుకైన తరగతి గదుల్లో అభ్యర్థులకు పాఠాలు చెబుతున్నారు. విద్యాసంస్థల్లో ఒక తరగతి గదిలో 1:30 నిష్పత్తి ప్రకారం అధ్యాపకుడు, అభ్యర్థులుంటారు.

కానీ అడిగేవారే లేకపోవడంతో ఒక తరగతి గదిలో 100కుపైగా విద్యార్థులను కూర్చోబెట్టి తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. సంఖ్య ఎక్కువైతే ఫంక్షన్ హాళ్లలో కూడా తరగతులు నిర్వహించిన సందర్భాలున్నాయి. కాగా విద్యార్థులకు కనీసం మూత్రశాలలు కూడా లేకపోవడం గమనించదగ్గ విషయం. 100 ఉండే కోచింగ్ సెంటర్‌లో కనీసం రెండు బాత్‌రూమ్‌లు కూడా ఉండవని పలువురు అభ్యర్థులు విమర్శిస్తున్నారు. దీంతో మంచినీళ్లు తాగాలంటేనే అభ్యర్థులు భయపడుతున్నారు. కనీసం పార్కింగ్ సదుపాయం కూడా లేకపోవడంతో వాహనాలు నిలిపేందుకు కూడా ఇక్కట్లు పడాల్సి వస్తోంది. కాగా కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు విద్యార్థులను ఆకర్షించేందుకు డెమో క్లాసులకు నిష్ణానితులైన సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్‌ను తీసుకొచ్చి, అభ్యర్థులు జాయిన్ అయ్యాక అందుబాటులో ఉన్న అధ్యాపకులతో మమా అని కోచింగ్‌ను పూర్తి చేయిస్తున్నట్లు తెలుస్తోంది. 

ముందస్తు చర్యలు శూన్యం

నగరంలోని కోచింగ్ సెంటర్లు, వాటికి అనుబంధంగా ఉన్న హాస్టళ్లు, స్టడీ సెంటర్లలో వందల సంఖ్యలో ఉద్యోగార్థులు ఉంటున్నారు. అకస్మాత్తుగా జరిగే ప్రమాదాల నివారణ కోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేయాలి. కానీ ఎక్కడా ఈ చర్యలు తీసుకోవడం లేదు. భవనం చుట్టూ ఫైర్ ఇంజన్ తిరిగేలా స్థలం ఉండాలి. కానీ అలాంటి ముందస్తు జాగ్రత్తలు ఏ కోచింగ్ సెంటర్లో కనిపించడం లేదు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

హాస్టళ్లు, స్టడీరూమ్‌లకు అదనపు ఫీజులు

అభ్యర్థులు కోచింగ్ సెంటర్లకు ట్యూషన్ ఫీజు చెల్లించడంతోపాటు హాస్టల్, స్టడీరూమ్‌ల కోసం అదనంగా ఫీజులను చెల్లి స్తున్నారు. అందుకోసం హాస్టళ్లకు నెలకు రూ.6వేల నుంచి 10వేలు, స్టడీరూమ్స్ కో సం రూ.1500 నుంచి రూ.3వేలు చెల్లిస్తున్నారు. అయినప్పటికీ హాస్టళ్లలో నాణ్యమైన భోజనం లభించడంలేదని విద్యార్థులు చెబుతున్నారు. కనీసం మూడు అడుగులు కూడా లేని క్యాబిన్‌ను ఇచ్చినందుకు స్టడీ రూమ్స్ పేరిట రూ.2 నుంచి 3వేలు చెల్లిస్తున్నారు. 

కోచింగ్ సెంటర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి

నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా కోచింగ్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. విద్యార్థులకు కనీస వసతులు కల్పించడంలేదు.ఫైర్‌సేఫ్టీ, ముందుజాగ్రత్త చర్యలు పాటించడంలేదు. కోచింగ్ సెంటర్ల ఆగడాలపై గతంలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా మాట్లాడారు. ప్రభుత్వం స్పందించి వెంటనే కోచింగ్ సెంటర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకుని అభ్యర్థులకు ముందస్తు జాగ్రత్తలు, వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలి. పలువురు అనుమతులు లేకున్నా ఇంటర్, డిగ్రీ కోర్సులతో కలిపి సివిల్స్ కోచింగ్ పేరిట శిక్షణ ఇస్తున్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు.

 ఎండీ జావీద్, డీవైఎఫ్‌ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి