06-03-2025 12:51:39 AM
ఇంటర్ పరీక్షలకు అర్హత కోల్పోయిన విద్యార్థి
నాగర్ కర్నూల్ పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాల యాజమాన్యం నిర్వాకం
నాగర్ కర్నూల్, మార్చి 5 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యార్థి ఇంటర్ పరీక్షలకు దూరమయ్యాడు. హాజరు శాతం సరిగ్గా లేదనే సాకు చూపి ఇంటర్ పరీక్షకు ఫీజు చెల్లించకపోవడంతో ఈ ఏడాదంతా విద్యార్థి విద్యకు దూరమయ్యాడు. వివరాల్లోకి వెళ్తే నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం గడ్డంపల్లి గ్రామానికి చెందిన ఓ ఇంటర్ స్టూడెంట్ జిల్లా కేంద్రంలోని రవితేజ జూనియర్ కళాశాలలోఇంటర్ చదువుతున్నాడు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా కళాశాలకు సక్రమంగా హాజరు కాలేకపోవడంతో దాన్ని అలుసుగా తీసుకొని యజమాన్యం ఆ విద్యార్థికి ఇంటర్ పరీక్షలకు ఫీజు చెల్లించకపోవడంతో ప్రస్తుతం హాల్ టికెట్ అందక బుధవారం నుంచి జరుగుతున్న ఇంటర్ పరీక్షలకు దూరమయ్యాడు. జనవరి 29న జరిగిన ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలకు సైతం విద్యార్థి హాజరు కాకపోవడం విశేషం. ఆలస్యంగా తేరుకున్న బాధిత విద్యార్ధి తండ్రి కళాశాలకు చేరుకొని సంబంధిత ప్రిన్సిపల్ శ్రీనివాసులుని ప్రశ్నించగా కాలేజ్ ఫీజ్ కట్టకపోతే పరీక్ష ఫీజు ఎలా చెల్లించాలి అంటూ ఎదురు ప్రశ్నించారు.
కేవలం కళాశాలకు 34 రోజులు మాత్రమే వచ్చినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. ఇదే విషయంపై ఇంటర్ నోడల్ అధికారి వెంకటరమణ స్పందిస్తూ సమస్య తన దృష్టికి వచ్చిందని విద్యార్థి అడ్మిషన్ జరిగిన తర్వాత ఫీజు కట్టించాల్సిన బాధ్యత సంబంధిత కళాశాల యాజమాన్యంపైనే ఉంటుందని సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు స్పందించారు పరీక్షల ఫీజు చెల్లించే సమయంలో సంబంధిత విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడం జరిగిందని ఆటో తోలుకుంటామని చదువుపై మా పిల్లవాడికి శ్రద్ధ లేదంటూ చెప్పినట్లు పేర్కొన్నారు.
అయినా జనవరి 29న ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు జరిగాయని అప్పుడు కూడా కళాశాలకు రాలేదని కానీ పరీక్ష అరగంట ముందు కళాశాలకు వచ్చి హాల్ టికెట్ కావాలని అడిగితే ఎలా అంటూ స్పందించారు. బుధవారం జరిగిన ఇంటర్ పరీక్షల్లో జిల్లా వ్యాప్తంగా 5172 మంది జనరల్ 1645 ఒకేషనల్ మొత్తంగా 6817 మంది విద్యార్థులకు గాను 4924 జనరల్ 1 525 మంది ఒకేషనల్ మొత్తంగా 6449 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు ఇంటర్ నోడల్ అధికారి వెంకటరమణ పేర్కొన్నారు.