కలెక్టరేట్ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 11 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్స్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టీ నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో లక్డీకపూల్ నుంచి ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐదేళ్లుగా రూ.8 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం మాదిరిగానే వ్యవహరిస్తోందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాకపోవడంతో సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి అశోక్‌రెడ్డి తెలిపారు. ఫీజులు కట్టలేక పై చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బకాయిలు విడుదల చేయకపోతే భవిష్యత్తులో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.