ప్రజాప్రభుత్వంలో విద్యార్థుల సమస్యలు పట్టవా?
ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పుట్ట లక్ష్మణ్
సచివాలయ ముట్టడికి యత్నం.. పలువురి అరెస్ట్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 15 (విజయక్రాంతి): ప్రజాప్రభుత్వంలో విద్యార్థుల సమస్యలు పట్టించుకోరా? అని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పుట్ట లక్ష్మణ్, కసిరెడ్డి మణికంఠరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌చేశారు. సోమవారం ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సచివాలయ ముట్టడికి యత్నించారు. బీఆర్‌కే భవన్ వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్, మణికంఠరెడ్డి మాట్లాడుతూ.. స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా దాదాపు రూ.8 వేల కోట్ల బకాయిలున్నాయని చెప్పారు. కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా కాలేజీల యాజమాన్యాలు కూడా విద్యాసంస్థలను నడుపలేక మూసివేసే యోచనలో ఉన్నాయని పేర్కొన్నారు. ‘ఫీజు’ బకాయిలపై వన్‌టైం సెటిల్‌మెంట్ చేసుకోవాలని సీఎం చెప్పడం సబబు కాదన్నారు. అధికారంలోకి వచ్చాక ఫీజు బకాయిలు చెల్లిస్తామని ఎన్నికల ముందు చెప్పిన మాటకు రేవంత్‌రెడ్డి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు.