25-03-2025 12:32:24 AM
కరీంనగర్, మార్చి 24 (విజయ క్రాంతి): పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని కోరుతూ శాతవాహన యూనివర్సిటీ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ సోమవారం సంబంధిత రిజిస్టర్, పరీక్షల నియం త్రణ అధికారికి వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా సుప్మా అధ్యక్షులు వెంకటేశ్వర రావు మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ హామీలను నెరవేర్చకపోవడం వలన రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు రెండవ, నాల్గవ మరియు ఆరవ సెమిస్టర్ పరీక్షల తేదీలను ప్రకటించకూడదని, అట్టి తేదీలను ప్రకటించి,పరీక్షలు నిర్వహించడానికి ముందుకు వచ్చినట్టయితే అట్టి పరీక్షలను బహిష్కరిస్తామని తెలిపారు.
గత 20 నెలలుగా ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకపోవడం వలన చాలామంది యాజమాన్యాలు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నాయని, ఆర్థికంగా చాలా నష్టపోతున్నాయని అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో మీ వంతు పాత్ర పోషించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సుప్మా ప్రధాన కార్యదర్శి శ్రీపాద నరేష్, పలు విద్యాసంస్థల కరస్పాండెంట్స్ పాల్గొన్నారు.