calender_icon.png 26 October, 2024 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులపై ఫీజు భారం!

26-10-2024 12:06:17 AM

  1. పరీక్షఫీజు పెంపు యోచనలో ఇంటర్ బోర్డు
  2. వెయ్యి రూపాయలు పెంచేందుకు కసరత్తు 

హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): విద్యార్థులపై ఇంటర్ బోర్డు అధికారులు ఫీజు భారం మోపనున్నారు. ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజులను పెంచేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. ఫీజులను 100 శాతం పెంచాలని అధికారులు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. రూ.ప్రస్తుతం రూ.500 ఇంటర్ వార్షిక పరీక్షా ఫీజుగా వసూలు చేస్తున్నారు.

దీన్ని వెయ్యి రూపాయలకు పెంచనుండగా, ఇందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి అధికారులు ఫైల్‌ను పంపించనున్నారు. అయితే ఈ ఫీజును రూ.1500లకు పెంచాలని అధికారులు ఆలోచన చేసినా ఆ తర్వాత వెనక్కి తగ్గి, వెయ్యి రూపాయల వరకు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రూ.1,000 లేదా రూ.900 ఖరారు చేయాలని భావిస్తున్నారు. ఇంటర్ వార్షిక పరీక్షలను 2025 మార్చిలో నిర్వహించనున్నారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కలుపుకుంటే మొత్తంగా 9 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ విద్యార్థులందరిపై సర్కారు ఫీజు భారం మోపనుంది. ప్రధానంగా ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులపై ఎక్కువ భారం పడనుంది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరీక్షా ఫీజులను ఎడాపెడా పెంచుతోందనే విమర్శ ఉంది. గతంలో నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్), డీఎస్సీ పరీక్షా ఫీజులను సర్కారు అమాంతం పెంచింది. టెట్ ఫీజు గతంలో రూ.400 ఉండగా రూ.1,000 వసూలు చేసింది.

ఇదే కాకుండా డీఎస్సీకి సైతం వెయ్యి రూపాయలు ఫీజుగా తీసుకుంది. నిరుద్యోగుల నుంచి రూపాయి ఫీజు తీసుకోబోమని హామీనిచ్చి, అదే నిరుద్యోగుల నుంచి వేలకు వేలు ఫీజులను వసూలు చేసిందని అభ్యర్థులు విమర్శిస్తున్నారు. త్వరలోనే పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేయనుంది.