calender_icon.png 10 January, 2025 | 5:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫెడెక్స్ కొరియర్ పేరుతో సైబర్ మోసం

01-08-2024 08:30:00 AM

  1. గోల్డెన్ అవర్‌లో పోలీసులకు బాధితుడి ఫిర్యాదు 
  2. సైబర్ నేరగాళ్ల ఖాతాలోని రూ. 3.49 లక్షలు ఫ్రీజ్ చేసిన పోలీసులు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 31 (విజయక్రాంతి): ఫెడెక్స్ కొరియర్ పేరుతో సైబ ర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితుడికి సైబర్ క్రైమ్ పోలీసులు డబ్బును తిరిగి అందేలా చేశారు. నగరానికి చెందిన ఓ ప్రైవే ట్ ఉద్యోగి (32)కి ఫెడెక్స్ కొరియర్ పేరుతో మంగళవారం సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. అతడి పేరు, చిరునామాతో గల పార్శిల్‌లో నకిలీ పాస్‌పోర్ట్‌లు, డ్రగ్స్ వంటివి ఉన్నాయ ని, ఈ నేపథ్యంలో అతడిపై ముంబాయి క్రైమ్ బ్రాంచ్ అధికారులు కేసు నమోదు చేశారని భయభ్రాంతులకు గురి చేశారు.

కాసేపటి తర్వాత ముంబాయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులమంటూ సైబర్ నేరగాళ్లు స్కైప్ వీడియో కాల్ చేశారు. కేసు విచారణ నిమి త్తం అని చెప్పి బాధితుడి బ్యాంకు ఖాతా వివరాలను తెలుసుకొని, అందులో ఉన్న రూ. 3.71 లక్షలను తమ ఖాతాకు బదిలీ చేయించుకున్నారు. అనంతరం వారి నుంచి స్పంద న లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు ఘటన జరిగిన గంటలోపు 1930కి కాల్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు సత్వరమే స్పందించి సైబర్ నేరగాళ్ల ఖాతాలో ఉన్న రూ. 3.49 లక్షలను ఫ్రీజ్ చేశారు.  

స్టాక్ మార్కెట్ పేరుతో..

నగరానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి (43)కి స్టాక్ మార్కెట్ పట్ల ఆసక్తి ఉందా? అని వాట్సాప్ మెసేజ్ వచ్చింది. దీంతో బాధితుడు ఆసక్తి ఉంది అని సమాధానం ఇవ్వడంతో సైబర్ నేరగాళ్లు రెండు రకాల పెట్టుబడుల గురించి వివరించారు. షార్ట్ టైం, లాంగ్ టైం గురించి చెప్పడంతో బాధితుడు షార్ట్ టైం పద్ధతిని ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బాధితుడిని 113 మంది సభ్యులతో కూడిన ఓ వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేశారు. అనంతరం గ్రూప్‌లోని సభ్యులు వారికి వచ్చిన లాభాల వివరాలను గ్రూప్‌లో పంచుకోవడవంతో, బాధితుడు తనకు కూడా డబ్బు వస్తుందనే ఆశతో మొదట్లో కొద్ది మొత్తంలో పెట్టుబడులుగా పెట్టగా లాభాలు బాగానే వచ్చాయి.

దీంతో పలు దఫాలుగా మొత్తం రూ. 11.51 లక్షలను పెట్టుబడులుగా పెట్టాడు. వచ్చిన లాభాలను విత్‌డ్రా చేసుకోవాలంటే పన్ను చెల్లించాల్సి ఉంటుందని, లేకపోతే మొత్తం డబ్బును రిజర్వ్‌బ్యాంక్‌కు విరాళంగా ఇస్తామని బెదిరించారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.