calender_icon.png 29 September, 2024 | 3:07 AM

ఫెడ్ టెన్షన్.. చెదిరిన రికార్డు

19-09-2024 12:00:00 AM

  1. ఐటీ షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు
  2. క్షీణించిన స్టాక్ సూచీలు

ముంబై, సెప్టెంబర్ 18: యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయా న్ని ప్రకటించనున్న నేపథ్యంలో ఐటీ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఒకవైపు బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు జరిగిన ప్పటికీ, ఐటీలో అమ్మకాల తీవ్రత కారణంగా బుధవారం స్టాక్ సూచీలు నష్టాలతో ముగిసాయి. ఇంట్రాడేలో సరికొత్త రికార్డుల్ని నెలకొల్పిన స్టాక్ సూచీలు వెను వెంటనే తీవ్ర పతనానికి లోనయ్యాయి. ట్రేడింగ్ ముగింపు సమయానికి కొంతమేర నష్టాల్ని తగ్గించుకున్నాయి.

బీఎస్‌ఈ సెన్సెక్స్ మధ్యాహ్న సెషన్లో 246 పాయిం ట్లు పెరిగి 83,326 పాయింట్ల వద్ద సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఆ స్థాయి నుంచి దాదాపు 600 పాయింట్లు పతనమై 82,700 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకింది. చివరకు 131 పాయింట్ల నష్టంతో 82,948 పాయింట్ల వద్ద నిలిచింది. ఇదేబాటలో నిఫ్టీ 25,482 పాయింట్ల వద్ద కొత్త రికార్డు స్థాయిని తాకిన తర్వాత 25,285 పాయింట్ల కనిష్ఠస్థాయికి పడిపోయింది. చివరకు 41 పాయింట్ల నష్టంతో 25,377 పాయింట్ల వద్ద నిలిచింది. 

ఇన్వెస్టర్ల జాగ్రత్త

యూఎస్ ఫెడ్ పాలసీ రేటుపై నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించి, కొత్త గరిష్ఠస్థాయిల వద్ద లాభాల స్వీకరణకు పాల్పడ్డారని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సి చెప్పారు. ఫెడ్  రేటును పావుశాతం తగ్గించే అవకాశం ఉన్నదని, 50 బేసిస్ పాయింట్లను తగ్గించవచ్చన్న అంచనాలు సైతం మార్కెట్లో కొనసాగుతున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్  దేవశ్ వకీల్ తెలిపారు. గురువారంనాటి ట్రేడింగ్ సెషన్‌లో సైతం మార్కెట్లు ఒడిదుడుకులకు లోనుకావచ్చని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు. 

టీసీఎస్ టాప్ లూజర్

సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా టీసీఎస్ 3.5 శాతం పడిపోయింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రాలు 3 శాతం వరకూ తగ్గాయి. సన్‌ఫార్మా, టాటా మోటార్స్ షేర్లు 1.8 శాతం వరకూ క్షీణించాయి. మరోవైపు బజా జ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, నెస్లే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు 3 శాతం వరకూ పెరిగాయి. వివిధ రంగాల సూచీల్లో అధికం గా ఐటీ ఇండెక్స్ 3 శాతం తగ్గగా, టెక్నాలజీ ఇండెక్స్ 2.43 శాతం క్షీణించింది. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 1.12 శాతం, కన్జూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 0.88 శాతం, మెటల్ ఇండెక్స్ 0.77 శాతం,  కమోడిటీస్ ఇండెక్స్ 0.66 శాతం చొప్పున తగ్గాయి.