calender_icon.png 10 October, 2024 | 7:58 PM

సూచీలకు ‘ఫెడ్’ జోష్

27-08-2024 12:00:00 AM

25వేల ఎగువన నిఫ్టీ

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు  భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో మన సూచీలూ దూసుకెళ్లాయి.

* విదేశీ పెట్టుబడులూ కలిసొచ్చాయి. రేట్ల కోతకు సమయం వచ్చిందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్‌పర్సన్ జెరోమ్ పావెల్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్లలో జోష్‌కు కారణం. దీంతో సెన్సెక్స్ ఓ దశలో 700కి పైగా పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 25 వేల స్థాయి ఎగువన ముగియడం గమనార్హం. సెప్టెంబరులో కనీసం 25 బేసిస్ పాయింట్ల మేర రేట్ల కోత ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి.

* సెన్సెక్స్ ఉదయం 81,388.26 వద్ద (క్రితం ముగింపు 81,086.21) లాభాల్లో ప్రారంభమైంది. ఆద్యంతం లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 81,824.27 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 611.90 పాయింట్ల లాభంతో 81,698.11 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 182.75 పాయింట్ల లాభంతో 25,005 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.89గా ఉంది.

* సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, టెక్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాల్లో ముగిశాయి. అదానీ పోర్ట్స్, మారుతీ సుజుకీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ ఇండ్‌బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 79.76 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అమెరికా వడ్డీ రేట్ల కోత అంచనాల వేళ పసిడికి డిమాండ్ ఏర్పడింది. ఔన్సు ధర 2,560 డాలర్ల స్థాయి వద్ద ట్రేడవుతోంది.