calender_icon.png 12 October, 2024 | 7:57 PM

ఫెడ్ రేట్ల కోతకు రెడీ.. కొనసాగిన ర్యాలీ

23-08-2024 12:30:00 AM

  1. 81,000పైకి సెన్సెక్స్ 
  2. 24,800 దాటిన నిఫ్టీ

ముంబై, ఆగస్టు 22: యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌వోఎంసీ)లో మెజారిటీ సభ్యులు సెప్టెంబర్‌లో వడ్డీ రేట్ల తగ్గింపునకు మొగ్గుచూపిన నేపథ్యంలో గ్లోబల్ స్టాక్ మార్కెట్లు పాజిటివ్‌గా స్పందించాయి. ఈ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ మార్కెట్లో కమోడిటీ, కన్జూమర్, టెలికమ్యూనికేషన్ షేర్లలో జరిగిన కొనుగోళ్లతో  భారత స్టాక్ సూచీలు కీలక స్థాయిల్ని అధిగమించాయి. ఎఫ్‌వోఎంసీ ఇటీవలి మీటింగ్ మినిట్స్ బుధవారం రాత్రి వెల్లడయ్యాయి. దీనితో  గురువారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 331 పాయింట్లు పెరిగి 81,232 పాయింట్ల గరిష్టస్థాయిని చేరింది.

చివరకు  147 పాయింట్లు లాభంతో కీలకమైన 81,000 స్థాయిపైన 81,053 పాయింట్ల వద్ద నిలిచింది. గత రెండు రోజుల్లో ఈ సూచి 480 పాయింట్లు పెరిగింది. ఇదేబాటలో వరుసగా ఆరో రోజూ అప్‌ట్రెండ్ సాగించిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 24,800 పాయింట్ల స్థాయిని దాటింది. చివరకు 41 పాయింట్లు లాభపడి  24,811 పాయింట్ల వద్ద ముగిసింది. సెప్టెంబర్‌లో ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై స్పష్టత రావడంతో పాజిటివ్ గ్లోబల్ సెంటిమెంట్ కారణంగా దేశీయ సూచీలు స్వల్ప లాభాల్ని ఆర్జించాయని జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. 

పరిమిత లాభాలకు కారణం

జాక్‌సన్‌హోల్ సింఫోజియంలో శుక్రవా రం ఫెడ్ చైర్మన్ జెరోమ్ పొవెల్ వడ్డీ రేట్లపై ఇచ్చే సంకేతాల కోసం ఇన్వెస్టర్లు వేచిచూస్తూ కొంత జాగ్రత్త వహించారని, దీంతో సూచీల లాభాలు పరిమితంగా ఉన్నాయని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు. ఆసియా మార్కెట్లలో టోక్యో, సియోల్, హాంకాంగ్‌లు లాభాలతో ముగియగా, షాంఘై నష్టపోయింది. యూర ప్ మార్కెట్లు గ్రీన్‌లో క్లోజ్ అయ్యాయి. బుధవారం రాత్రి ఫెడ్ మినిట్స్ వెలువడిన తర్వాత యూఎస్ సూచీలు పెరిగాయి.

భారతి ఎయిర్‌టెల్ టాప్ గెయినర్

సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా భారతి ఎయిర్‌టెల్  1.63  శాతం పెరిగి రూ.1,487 వద్ద ముగిసింది. టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్‌లు 1.5  శాతం వరకూ లాభపడ్డాయి. మరోవైపు మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, టీసీఎస్, పవర్‌గ్రిడ్‌లు 1 శాతం వరకూ తగ్గాయి.వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా టెలికమ్యూనికేషన్స్ ఇండెక్స్ 1.60 శాతం,  కమోడిటీస్ ఇండెక్స్ 1 శాతం, కన్జూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 0.91 శాతం పెరిగాయి.

సర్వీసెస్ ఇండెక్స్ 0.70 శాతం, ఎఫ్‌ఎంసీజీ సూచి 0.59 శాతం,  మెటల్ ఇండెక్స్ 0.57 శాతం, రియల్టీ ఇండెక్స్ 0.49 శాతం చొప్పున పెరిగాయి. కన్జూమర్ డిస్క్రీషనరీ ఇండెక్స్ 0.55 శాతం చొప్పున పెరిగాయి. యుటిలిటీ, పవర్, ఎనర్జీ, ఐటీ సూచీలు  తగ్గాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.67 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.47 శాతం చొప్పున పెరిగాయి.