calender_icon.png 28 October, 2024 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భయం భయంగా పేదలు!

30-08-2024 01:32:17 AM

  1. అల్వాల్, బాలానగర్ మండలాల్లో.. 265 పేదల ఇళ్లకు నోటీసులు 
  2. వారం రోజుల్లో ఖాళీ చేయాలని నోటీసులో పేర్కొన్న రెవెన్యూ అధికారులు 
  3. భయాందోళనలు వ్యక్తంచేస్తున్న స్థానికులు
  4. పలువురు నాయకుల పరామర్శ 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (విజయక్రాంతి): రెవెన్యూ అధికారుల నోటీసులతో పేదలు భయపడుతున్నారు. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో నివసిస్తున్నన వందలాది మంది నిరుపేదలకు రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేశారు. అల్వాల్ మండలంలోని చినరాయిని చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్నారంటూ తక్షణమే ఖాళీ చేయాలంటూ స్థానిక జానకీనగర్ కాలనీ, ఆనంద రావు నగర్, భారతీనగర్ కాలనీ, రాంనగర్ కాలనీలకు చెందిన 140 మంది గుడిసెవాసులకు అల్వాల్ తహసీల్దార్ రాములు నాయకత్వంలో బుధ, గురువారాలలో నోటీసులు అందజేశారు.

చినరాయిని చెరువు మొత్తం 48 ఎకరాలలో 17.25 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా, మిగతాది ప్రైవేట్ ల్యాండ్ ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు.  ప్రైవేట్ ల్యాండ్‌లో స్థలాలను పేదలు కొనుగోలు చేసి గత 40 ఏళ్లుగా నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. అయితే ఈ నిర్మాణాలన్నీ చినరాయిని చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఉన్నందున నోటీసును తహసీల్దార్  నోటీసులు అందజేశారు. వారం రోజుల్లో ఖాళీ చేయాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, బాలానగర్ మండలం హస్మత్‌పేటలో హస్మత్ పేట చెరువు (బోయిని చెరువు) ప్రాంతంలో నివసించే 125 మందికి  బాలానగర్ తహసీల్దార్ కార్యాలయం అధికారులు నోటీసులు అందజేశారు. 

భయాందోళనలో పేదలు.. 

వాస్తవానికి అల్వాల్ మండలంలోని చినరాయిని చెరువు పరిసర ప్రాంతాల బస్తీల ప్రజలు, బాలానగర్ మండలంలోని హస్మత్ పేట ప్రాంతానికి చెందిన పేదలు దాదాపు 40, 50 ఏళ్ల క్రితం 40 గజాలు, 50 గజాల చొప్పున ప్రైవేటు వ్యక్తుల వద్ద కొనుగోలు చేసి నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అయితే, ప్రస్తు తం రెవెన్యూ అధికారులు  ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ల పరిధిలో కేవలం వ్యవసా యం మాత్రమే చేయాలని, ఎలాంటి నిర్మాణాలు చేయకూడదంటూ నోటీసులు ఇవ్వడంతో ఆందోళన చెందుతు న్నారు.  ఈ నోటీసులతో రోడ్డు పాలవుతామనే భయపడుతన్నారు. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి నివసిస్తున్న తామంతా ఎక్కడికి పోవాలంటూ అధికారులను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.  హస్మత్ పేటలో పేదల నివాసాలను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పరామర్శించి, గుడిసె వాసులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.