calender_icon.png 23 January, 2025 | 7:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భయ బంగ్లా!

08-08-2024 12:50:14 AM

హిందువులే లక్ష్యంగా దాడులు

20 ఆలయాల ధ్వంసం

దేశవ్యాప్తంగా చాలా ఇళ్లలో లూటీ

ఫర్నిచర్, నగలు, నగదు చోరీ

సింగర్ ఆనంద ఇంట్లో విధ్వంసం

బంగ్లాదేశ్‌లో ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా చెలరేగిన ఉద్యమం, హింసలో మైనార్టీలే సమిధలయ్యారు. ముఖ్యంగా అల్లరిమూకకు హిందువులే ప్రధాన టార్గెట్ అయినట్టు దాడులను చూస్తే అర్థమవుతుంది. షేక్‌హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు పారిపోయి వచ్చినా ఇంకా హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వంపై ఉద్యమం ముసుగులో ముస్లిం మతఛాందసవాదులు అడ్డు అదుపులేకుండా హిందువుల ఆలయాలు, ఇండ్లపై దాడులకు తెగబడ్డారు. హిందువుల వ్యాపార సంస్థలను లూటీ చేశారు. హిందూ సమాజానికి చెందిన ప్రముఖులను టార్గెట్‌గా చేసుకుని లూటీ చేస్తున్నారని కమ్యూనిటీ అసోసియేషన్ తెలిపింది. 

న్యూఢిల్లీ, ఆగస్టు 7: బంగ్లాదేశ్ జనాభా ౧౭ కోట్లు కాగా, అందులో హిందువులు 8 శాతం ఉన్నారు. వీరిలో చాలామంది మాజీ పీఎం షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్‌కు మద్దతు దారులు. హసీనా భారత్‌తో దృఢమైన సంబంధాలు కొనసాగించడమే ఇందుకు కారణం. అంతేకాకుండా ప్రతిపక్షాలతో పోలిస్తే అవామీ లీగ్ లౌకిక శక్తిగా వ్యవహరిస్తున్నది. కాగా, ప్రస్తుత ప్రభుత్వం కూలిపోవడం, కొత్త పరిపాలన వ్యవస్థ ఇంకా బాధ్యతలు చేపట్టక పోవడంతో అల్లరిమూకలు విధ్వంసం సృష్టిస్తున్నారు.

పోలీస్ స్టేషన్లు, జైళ్లు, అవామీ లీగ్ నాయకుల ఇళ్లతో పాటు హిందూ సంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూ వాళ్ల ఇళ్లను లూటీ చేస్తున్నారు. హిందువులకు చెందిన దాదాపు 300 ఇళ్లు, వ్యాపారాలను లూటీ చేసినట్లు రాయిటర్స్ వార్తా సంస్థకు హిందూ, బౌద్ధ, క్రిస్టియన్ కమ్యూనిటీ కౌన్సిల్ తెలిపింది. దాదాపు 20 వరకు హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు. హింసాకాండలో 40 మంది వరకు గాయపడ్డారు. మరోవైపు ముస్లింలు, హిందువులు హిందూ ఆలయాలకు రక్షణగా ఉంటామని అక్కడక్కడ పోస్టర్లు ప్రదర్శిస్తున్నారు.

కానీ ఆలయాల ధ్వంసం జరుగుతూనే ఉంది. ఇస్కాన్ స్వామిబాగ్ ఆలయంలోనూ ‘మీరంతా మా సోదరులు, ఎలాంటి భయం అవసరం లేదు. బంగ్లాదేశ్ మనందరిదీ’ అని రాసి ఉన్న పోస్టర్లను అతికించారు. అయితే అక్కడ రక్షణగా ఎవరూ లేరని ఇస్కాన్ సభ్యుడు దుర్లభ్ హరినామ్ దాస్ చెప్పారు. కానీ, అక్కడ ప్రజలతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని, అందువల్ల మాకు ఎలాంటి భయం లేదని ఆయన తెలిపారు. 

ఢాకాలోని ధాన్మండిలో బంగ్లాదేశీ గాయకుడు రాహుల్ ఆనందకు చెందిన ఇంటిపై దాడిచేశారు. సంగీత వాద్య పరికరాలు, ఫర్నిచర్‌ను తగలబెట్టారు. ఈ దాడి నుంచి అతని కుటుంబ సభ్యులు తప్పించుకున్నారు. సిరాజ్‌గంజ్‌లోని ప్రెస్‌క్లబ్‌పై జరిగిన మూకుమ్మడి దాడిలో డైలీ ఖబర్‌పాత్ర జర్నలిస్ట్ ప్రదీప్ భౌమిక్ మృతిచెందారు. మరో ముగ్గురు జర్నలిస్టులు గాయపడ్డారు. దేశంలో జరిగిన అల్లర్లలో దాదాపు 25 మంది పాత్రికేయులు గాయపడినట్లు తెలుస్తోంది.

ఈ పరిస్థితుల నడుమ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు, మాజీ ప్రధాని ఖలీదా జీయా కుమారుడు తారిఖ్ రెహమాన్ ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. “ఈ మార్పు సమయంలో మనం ప్రజాస్వామ్య మార్గంలో సంయమనం పాటిస్తూ శాంతిని ప్రదర్శించాలి. మతం, రాజకీయాలకు అతీతంగా బంగ్లాదేశీయులందరినీ వివక్షపూరిత హింస నుంచి రక్షించాల్సిన అవసరం ఉంది. అది మన కర్తవ్యం. ఎవరినీ వేధించకూడదు. సమాజంలో విభజన, ప్రతీకారానికి ప్రయత్నించకూడదు. మనమంతా గర్వంగా బంగ్లాదేశీయులుగా ఉండాలి” అని ఎక్స్ వేదికగా దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. 

మైనారిటీ ఇళ్ల లూటీ

కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి రాణాదాస్ గుప్తా మాట్లాడుతూ.. “హసీనా రాజీనామాకు కొన్ని గంటల ముందు నుంచి మతపరమైన దురాగతాలు మొదలయ్యాయి. హత్యలు జరగనప్పటికీ దాడులు పెరిగాయి. మైనారిటీల ఇళ్లు, వ్యాపారాలు, దేవాలయాలను టార్గెట్‌గా చేసుకున్నారు. వాటిని దోచుకుని ధ్వంసం చేస్తున్నారు” అని ఆందోళన వ్యక్తం చేశారు. ఢాకాకు చెందిన డెవలప్‌మెంట్ ప్రొఫెషనల్ అవిరూప్.. తన బంధువు పరిస్థితి గురించి వివరించారు. నెట్రోకోనాలో నివసించే ఆమె ఇంటిని వంద మంది వ్యక్తులు కర్రలు, ఇతర ఆయుధాలతో దాడి చేసి నగలు, డబ్బు, ఫర్నిచర్, టీవీ, బాత్రూమ్ ఫిట్టింగ్‌లతో పాటు తలుపులను సైతం ఎత్తుకెళ్లారని, అయితే ఎవరినీ గాయపరచలేదని తెలిపారు. “మీరు అవామీ లీగ్ వారసులు. మీ వల్ల దేశం అధ్వానంగా తయారైంది. దేశం విడిచి వెళ్లండి” అంటూ ఆ గుంపు చెప్పినట్లు అవిరూప్ తెలిపారు.