calender_icon.png 7 January, 2025 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దవాఖానలో దొంగల భయం

28-10-2024 01:15:39 AM

  1. కామారెడ్డి హాస్పిటల్‌లో రెచ్చిపోతున్న చోరులు
  2. సెల్‌ఫోన్లు, పర్సులు, బైక్‌ల అపహరణ
  3. రోగుల కోసం వచ్చిన వారి జేబులకు చిల్లు
  4. పట్టించుకోని ఆసుపత్రి అధికారులు
  5. సెక్యూరిటి సిబ్బంది ఉన్నా ఆగని చోరీలు
  6. ఒకే రోజు 8 మంది సెల్‌ఫోన్లు మాయం

కామారెడ్డి, అక్టోబర్ 27 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సర్కార్ దవాఖానలో దొంగలు రెచ్చిపోతున్నారు. రోగుల కోసం వచ్చే బంధువుల జేబులకు చిల్లు వేస్తున్నారు. నిత్యం హాస్పిటల్‌లో దొంగతనాలు జరుగుతున్నా అధికారులు మాత్రం స్పందించడం లేదు.

ఈ నెల 26న శుక్రవారం ఒకరోజే ఎనిమిది మంది రోగుల బంధువులకు చెంది న సెల్‌ఫోన్లు మాయం అవడం ఆందోళన కలిగిస్తుంది. ఆసుపత్రికి బైక్‌పై వచ్చి రోగిని పరా మర్శించి వచ్చేసరికి బైక్‌లు కనబడకుండా పోతున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా బైకుల ఆచూకీ మాత్రం లభించడం లేదు. 

ఇంటి దొంగల పనేనా?

కామారెడ్డి సర్కార్ దవాఖానకు వెళ్లాలంటే  రోగుల బంధువులు జంకుతున్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబారి పేట్‌కు చెందిన దాసరి మహేశ్ తన భార్యను డెలివరీ కోసం తీసుకొచ్చారు. అతనితోపాటు మామా సదాశివనగర్ మండ లం ధర్మారావుపేటకు చెందిన బండి భూమ య్య శుక్రవారం రాత్రి 2 గంటల వరకు మేల్కొవతోనే ఉండి పడుకున్నారు.

శనివారం ఉదయం లేచేసరికి ఇద్దరి సెల్‌పోన్లను చోరీచేశారు.ఈ ఇద్దరే కాకుండా మరో ఆరుగురు సెల్‌ఫోన్లు ఒకేరోజు మాయమయ్యాయి. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్న సామెతలా ఆసుపత్రిలో పనిచేస్తున్న కొందరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతివాటం వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

ఆసుపత్రిలో విధులు నిర్వహి స్తున్న వారిలో కొందరు గతంలో పలు చోరీ కేసుల్లో ఉండటం ఆందోళన కలిస్తున్నది. ఈ ఏడాదిలో ఇప్పటికే దవాఖానలో ఎనిమది బైక్‌లు అపహరణకు గురయ్యాయి.సెల్‌ఫోన్ బాధితులు 50 మందికి పైగానే ఉన్నారు. కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయగా మరికొందరు ఫిర్యాదు చేసినా లాభం లేదని మిన్నకుండిపోతున్నారు.

నిత్యం చోరీలు జరుగుతున్నా ఆసుపత్రి అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఒక కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదాల కేసులు వచ్చినప్పుడు ఉపయోగపడుతున్నారు తప్ప చోరీలపై దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

దవాఖానాకు వెళ్లాలంటే  దడ పుడుతుందని రోగుల బంధువులు వాపోతున్నారు. ఇప్పటికైన అధికారులు చోరీ సంఘటనలు సర్కార్ దవాఖానాలో జరుగకుండా చర్యలు తీసుకుంటారా లేదా మొద్దు నిద్రలోనే ఉంటారా అని రోగుల బంధువులు ప్రశ్నిస్తున్నారు.

చోరీలపై దృష్టి పెడతాం

కామారెడ్డి సర్కార్ దవాఖానలో జరుగుతున్న చోరీలపై దృష్టి పెడతాం. శుక్రవారం రాత్రి సెల్‌ఫోన్లు పోయాయని ఇద్దరు శనివారం ఫిర్యాదు చేశారు. సర్కార్ దవాఖానలో ఫిర్యాదులు వస్తే కేసులు నమోదు చేస్తాం. బాధితులే ఫిర్యాదు చేయడం లేదు. దవాఖానకు వచ్చే రోగులు, వారి బంధువులు అప్రమత్తంగా ఉండాలి. ఏమైనా జరిగితే ఫిర్యాదు చేస్తేనే నిందితులను పట్టుకునే అవకాశం ఉం టుంది. భవిష్యత్‌లో చోరీలు జరుగకుండా దృష్టి పెడుతాం. 

 చంద్రశేఖర్‌రెడ్డి, 

పట్టణ సీఐ, కామారెడ్డి