రిజర్వేషన్స్ డే సదస్సులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 26 (విజయక్రాంతి): జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల డిమాండ్ పెరుగుతుందనే భయంతోనే బీసీ కుల గణన చేపట్టడం లేదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టీ చిరంజీవులు అన్నారు. రిజర్వేషన్స్ డే (జూలై 26)ను పురస్కరించుకొని ప్రజా తెలంగాణ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘కుల జనగణన సంస్థలలో 42 శాతం బీసీ రిజర్వే షన్లు’ అనే అంశంపై శుక్రవారం సదస్సు నిర్వహించారు. ప్రజా తెలంగాణ కన్వీనర్ దేవళ్ల సమ్మయ్య అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో చిరంజీవులు మాట్లాడు తూ.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా బీసీలకు నేటికీ చట్ట సభల్లో రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడం శోచనీయం అన్నారు.
కులగణన చేస్తే బీసీల రిజర్వేషన్లు పెరుగుతాయనే భయాందోళన అగ్రకుల పాలకులకు ఉందన్నారు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓబీసీల లెక్క తేల్చేందుకు కుల గణన చేపట్టడం లేదని పేర్కొన్నారు. అనంతరం ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం కుల గణనపై అసెంబ్లీలో తీర్మానం, జీవో విడుదల చేసి నాలుగు నెలలు అవుతున్నా ఎందు కు కార్యాచరణను ఆచరణలో పెట్టడం లేదని నిలదీశారు. రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. కులగణనతోనే సామాజిక న్యాయం లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రొ. తిరుమలి, ప్రొ. ఎస్ సింహ ద్రి, డాక్టర్ ముచ్చర్ల పృథ్వీరాజ్, సీనియర్ జర్నలిస్ట్ దుర్గం రవీందర్, ఇంజినీర్ సతీష్ కొట్టె, వినోద్ కుర్వ తదితరులు పాల్గొన్నారు.