- పార్లమెంట్ ఫలితాలతో అంతా మారింది
- ప్రజలకు అర్థమయ్యే బీజేపీకి మద్దతివ్వలేదు
- భారత్‌లో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది
- అమెరికాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ప్రజల్లో బీజేపీపై ఉన్న భయం పోయిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భారత్ ఒకే సిద్ధాంతంగా ఉండాలే ఆలోచనతో ఆర్‌ఎస్‌ఎస్ ఉందని, కానీ భారత్ వైవిధ్య దేశమని కాంగ్రెస్ భావిస్తున్నట్లు చెప్పారు. ఈ విష యంపై తాము ఎప్పటినుంచో పోరాటం చేస్తున్నట్లు వివరించారు. అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో నిర్వహించిన భారత్ కమ్యూనిటీతో ముచ్చటించారు.
మాయమైన భయం
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత రాజకీయాల్లో ప్రేమ, గౌరవం, వినయం లేవు. నేతలు కులమతాలకు అతీతంగా అందరినీ ప్రేమించాలి. శక్తిమంతులే కాక భారత నిర్మాణానికి సహకరించే అందరినీ గౌరవించాలి. కుల, మత, భాష, సంప్రదాయాలతో సంబం ధం లేకుండా అందరికీ ప్రాతినిధ్యం ఉండాలి. సంస్కృతి, భాషలపై బీజేపీ దాడి చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీ తగ్గడంతో ఆ పార్టీ, ప్రధాని మోదీపై ఉన్న భయం ప్రజల్లో పోయింది. ఈ విజయం ప్రజలందరిది. మహిళల పట్ల బీజేపీ, ప్రతిపక్షాల వైఖరిలో సైద్ధాంతిక తేడాలు ఉన్నాయి. వాటిపైనా మేం పోరాడుతున్నాం. మహిళలు కొన్ని పనులకే పరిమితం కావాలని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నమ్ముతారు అని వ్యాఖ్యానించారు.
తయారీ రంగంపై దృష్టిపెట్టాలి
అమెరికాలో భారత కమ్యూనిటీతో సంభాషణ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు ముందు రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర గురించి ప్రస్తావించారు. ఈ యాత్ర తనను ఎంతగానో మార్చిందని గుర్తుచేసుకున్నారు. తన ఆలోచనా విధానంలో మార్పులు వచ్చాయని, కొత్తకోణంలో ఆలోచించగలుగుతున్నానని, ప్రజలతో ప్రత్యేక బంధం ఏర్పడి ందని తెలిపారు. జోడో యాత్రతో భారత రాజకీయాల్లో ప్రేమ అనే కొత్త అధ్యాయాన్ని తీసు కురాగలిగామని పేర్కొన్నారు. అంతకుముండు డల్లాస్‌లోని టెక్సాస్ యూనివర్సిటీలోని విద్యార్థులతో రాహుల్ సంభాషించారు.
భారత్, అమెరికాతోపాటు అనేక పశ్చిమ దేశాలను నిరుద్యోగ సమస్య వేధిస్తోందని అన్నారు. ముఖ్యంగా భారత్‌లో పరిస్థితి తీవ్రంగా ఉంద ని తెలిపారు. కానీ అనేక ఇతర దేశాలు ఈ విషయంలో అంత ప్రభావం లేదని, చైనా మాత్రం ఈ ఇబ్బందిని ఎదుర్కోవడం లేదని పేర్కొన్నారు. ఉత్పత్తిరంగంలో ఇప్పటికీ చైనా ఆధిప త్యం కొనసాగుతోందని, అందుకే నిరుద్యోగ సమస్య తలెత్తడం లేదన్నారు. తయారీ రంగం పై భారత్ దృష్టి పెడితే నిరుద్యోగ సమస్యను పారద్రోలవచ్చని సూచించారు. గతంలోనూ భారత ప్రజాస్వామ్యంపై రాహుల్ విదేశాల్లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
అలా చేస్తే తెలుగు ప్రజలను అవమానించినట్లే
భాష, సంప్రదాయాలపై బీజేపీ దాడి చేస్తోందని ఆరోపించిన రాహుల్.. తెలుగు భాషను ఉదాహరణగా తీసుకుని ప్రత్యేకంగా ప్రస్తావించారు. జాతీయ గీతం అన్ని రాష్ట్రాలను గుర్తిస్తూ సమానంగా చూస్తుంది. అలాగే భాష, సంప్రదాయాలు కూడా. తెలుగునే తీసుకుంటే అది కేవలం భాష మాత్రమే కాదు. దానికి ఒక చరిత్ర, సంస్కృతి ఉంది. తెలుగు కంటే హిందీ ముఖ్యమని ఆ రాష్ట్ర ప్రజలకు చెబితేవారిని అవమానించినట్లే. అంటే తెలుగు చరిత్ర, సంస్కృతి, పూర్వీకులు మీకు ముఖ్యం కాదని చెప్పినట్లే. ఈ చిన్న తేడాను అర్థం చేసుకోకపోవడం వల్లే భారత్‌లో ఇప్పటికీ పోరాటం జరుగుతోంది అంటూ పరోక్షంగా బీజేపీని రాహుల్ విమర్శించారు.