16-02-2025 12:36:04 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు బర్డ్ ఫ్లూ వైరస్ వల్ల భయపడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో చికెన్ మాటెత్తితే హడలెత్తిపోతున్నారు. ఇప్పుడు ఈ భయం బడులకూ వ్యాపించింది. రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నెలలో కొన్ని రోజులు చికెన్, గుడ్లు పెడతారు. అలాగే ఇతర ప్ర భుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కూడా మధ్నాహ్న భోజనంలో వారానికి ఒకసారి గుడ్లు పెడతారు. అయితే బర్డ్ ఫ్లూ విజృంభిస్తున్న నేపథ్యంలో పాఠశాలల్లోని విద్యార్థులకు చికెన్, కోడి గుడ్లు పెట్టడం పట్ల వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా కొన్ని రోజుల పాటు వారికి చికెన్, గుడ్లు పెట్టకపోవడమే మంచిదనే భావనలో ఉన్నారు. ఇదే అభిప్రాయాన్ని ఉపాధ్యాయులు ఉన్నతాధికారుల వద్ద వ్యక్తం చేస్తున్నారు. చికెన్, గుడ్ల స్థానంలో మరేదైనా అందిస్తే బాగుంటుదని పేర్కొంటున్నారు. బర్డ్‌ఫ్లూ, కుళ్లిన చికెన్‌కు సంబంధించి అక్కడక్కడా కేసులు నమోదవుతున్నాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల్లో భాగం గా కేజీబీవీలు, గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని రోజులు చికెన్‌ను నిలిపివేయాలని పలువురు ప్రధానోపాధ్యాయులు కోరుతున్నారు. దీనిపై పశుసంవర్థక శాఖ అధికారులతో విద్యాశాఖ అధికారులు చర్చించి త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
చౌటుప్పల్‌లో 500 కోళ్లు మృతి
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 15 (విజయ క్రాంతి): ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైందనుకున్న బర్డ్ ఫ్లూ తెలం గాణకూ వ్యాపించినట్టు తెలుస్తుంది. చౌటుప్పల్‌లోని నేలపట్ల గ్రామంలోని ఓ కోళ్ల ఫామ్‌లో సు మారు 500 కోళ్లు మృతి చెం దాయి. బర్డ్ ఫ్లూ కారణంగా పెద్ద మొత్తంలో కోళ్లు చనిపోయాయని పౌల్ట్రీ రైతు భావిస్తున్నారు. చనిపోయిన కోళ్ల విలువ దాదాపు లక్షల్లో ఉండటంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ నుంచి కోళ్లు తెలంగాణకు సరఫరా కాకుండా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్టు అధికారులు ప్రకటించారు. అయితే పకడ్బందీ చర్యలు తీసుకోవడంలో విఫలం కావడంతోనే బర్డ్ ఫ్లూ తెలంగాణకు కూడా వ్యాపించిందని రైతులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన కోళ్లను గుంతలో పాతిపెట్టి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదని వాపోతున్నారు.