calender_icon.png 5 February, 2025 | 12:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెంబేలెత్తిస్తున్న బెబ్బులి..

04-02-2025 06:31:35 PM

6 రోజులుగా హై టెన్షన్..

తాజాగా దుబ్బ గూడెం శివారులో పాదముద్రల గుర్తింపు..

అటవీ గ్రామాల్లో భయం.. భయం..!

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి అడవుల్లో గత ఆరు రోజులుగా బెబ్బులి బెంబేలెత్తిస్తుంది. కన్నాల-బుగ్గ శివారు అటవీ ప్రాంతంలో మకాం వేసి అటవీ అధికారులను, సిబ్బందిని కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. కొమురం భీం ఆసిఫాబాద్ అడవుల నుండి కన్నాల శివారులో సంతరిస్తున్న బెబ్బులిని బెజ్జూరు ప్రాంతానికి చెందిన బి 1 గా నిర్ధారించినట్లు బెల్లంపల్లి రేంజ్ అటవీ అధికారులు వెల్లడించారు. గత నెల 30 నుండి ఈ నెల 4 వరకు కన్నాల-బుగ్గ శివారు అటవీ ప్రాంతంలోనే బీ1 సంచరిస్తూ అందరినీ అడలెత్తించింది. వేటగాళ్ల భారి నుండి ఈ ప్రాంతానికి వచ్చిన పెద్దపులిని కాపాడేందుకు అటవీ అధికారులు నిరంతరం నిఘా నేత్రాల పరిశీలనలో కదలికలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూనే ఉన్నారు. పెద్దపులి సంచారంపై ప్రభావిత గ్రామాల ప్రజలను హెచ్చరిస్తూ అప్రమత్తం చేస్తూనే ఉన్నారు.

గర్భవతిగా ఉన్న బి-1 నీటి వసతి, ఆహారం సమృద్ధిగా ఉన్న బెల్లంపల్లిలోని కన్నాల-బుగ్గ అడవులను స్థావరంగా చేసుకోని ఇక్కడే మకాం వేస్తుందనే అభిప్రాయాలు సైతం వ్యక్తమయ్యాయి. దీంతో కన్నాల అడవులను ఆనుకొని ఉన్న కన్నాల, లక్ష్మీపూర్, గాంధీనగర్, కుంట రాములు బస్తి, బుగ్గ గూడెం, వారి పేట, కరిశల ఘట్టం, అంకుశం, లింగధరి గూడెం, గుండు గూడెం గ్రామాల ప్రజలు తమ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. కన్నాల అడవుల గుండా సమీపంలోని పెద్దనపల్లి శివారు ప్రాంతాల్లో సంచరించి తిరిగి కన్నాల- బుగ్గ అడవులకు పెద్దపులి పలుసార్లు చేరుకోవడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఇక్కడి అటవీ జంతువులను క్రూరంగా పెద్దపులి వేటాడి చంపిన తీరుతో కన్నాల-బుగ్గ రహదారిపై ఆరు రోజులుగా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బుగ్గ దేవాలయం కూడా ఎండోమెంట్ అధికారులు మూసివేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బుగ్గ అటవీ ప్రాంతం వైపు వెళ్లాలంటేనే స్థానికులు భయపడుతున్నారు.

సోమవారం రాత్రి వరకు కన్నాల-బుగ్గ అడవుల్లో యదేచ్చగా సంచరించిన బెబ్బులి తాజాగా మంగళవారం కన్నాల అటవీ ప్రాంతానికి సమీపంలోని కాసీపేట మండల పరిధిలోని పెద్దనపల్లి పరిసర ప్రాంతంలోని పత్తి చేల మీదుగా దుబ్బ గూడెం వైపుకు వెళ్ళినట్లు అటవీ సిబ్బంది గుర్తించిన పాదముద్రల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం పెద్దపులి కన్నాల అడవులను వీడి దుబ్బగూడెం మీదుగా కాసిపేట అడవుల వైపు వెళ్లిపోయిందని అటవీ అధికారులు చెబుతున్నారు. అయితే ఆహారం దృష్ట్యా మళ్లీ పెద్దపులి కన్నాల-బుగ్గ అటవీ ప్రాంతానికి వచ్చే అవకాశాలు లేకపోలేదు. కాసిపేట, బెల్లంపల్లి మండలాలను ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం తీవ్రంగా ఉండడంతో పంట పొలాలకు వెళ్లే రైతులు, ప్రభావిత అటవీ గ్రామాల ప్రజలు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పులికి హాని తన పెట్టవద్దని, పెద్ద పులి కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని అటవీ సిబ్బంది కోరుతున్నారు. ఏది ఏమైనా ఆరు రోజులుగా బెబ్బులి సంచారంతో కాజీపేట, బెల్లంపల్లి మండలాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంటుంది.