- గతేడాదితో పోలిస్తే 33 శాతం అధికం
- జాబితాను విడుదల చేసిన కేంద్రం
- టాప్‌లో మహారాష్ట్ర.. తెలంగాణకు ఆరో స్థానం
- విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 93 శాతం హైదరాబాద్‌కే
హైదరాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పన వంటి అంశాలే ప్రభుత్వాల పనితీరుకు ప్రామాణికంగా పరిగణించవచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే అద్భుత పనితీరును కనబర్చింది.
రాష్ట్రానికి ఈ ఏడాది వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్) ప్రవాహం గణనీయంగా పెరగడమే దీనికి నిదర్శనం. పెట్టుబడుల ఆకర్షణకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. ఈ క్రమంలోనే ఏడాదిలో రెండు విదేశీ పర్యటనలు చేసి వేలకోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగింది.
రాష్ట్రంలో వ్యాపారానికి అనుకూల వాతావరణాన్ని కల్పిస్తూ పెట్టుబడిదారులకు ఎన్నో రాయితీలను అందిస్తున్నది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పాలసీలను రూపొందిస్తూ రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలుపుతున్నది.
33 శాతం అధికం..
ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల కారణంగా రాష్ట్రానికి ఎఫ్‌డీఐలు వెల్లువలా వస్తున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆరునెలల్లో (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో) రాష్ట్రానికి రూ.12,864 కోట్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లో రాష్ట్రానికి రూ.9,679 కోట్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. కాగా గతేడాదితో పోలిస్తే ఈసారి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏకంగా రూ.3,185 కోట్లు ఎక్కువగా వచ్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఈ ఏడాది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వృద్ధి ఏకంగా 33 శాతం పెరిగింది.
హైదరాబాద్‌కే 93 శాతం..
తెలంగాణకు వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో అధిక శాతం (93%) హైదరాబాద్ నగరమే ఆకర్షించింది. రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌కు రూ.11,970 కోట్లు, రంగారెడ్డి జిల్లాకు రూ.680 కోట్లు, మహబూబ్‌నగర్‌కు రూ.116.7 కోట్లు, మెదక్‌కు రూ.96.99 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని వనరులు, మౌలిక సదుపాయల కల్పన వంటి అంశాల ఆధారంగా విదేశీ పెట్టుబడులను గణనీయంగా ఆకర్షించగలిగింది. మహబూబ్‌నగర్, మెదక్ వంటి ద్వితీయ శ్రేణి నగరాలకూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడం సానుకూలమైన అంశంగా పరిగణించవచ్చు.
తెలంగాణకు ఆరో స్థానం..
దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల వారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల జాబితాను కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆరు నెలల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పరిగణనలోకి తీసుకుని విడుదల చేసిన జాబితాలో తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక మొదటి మూడు స్థానాల్లో నిలువగా.. ఢిల్లీ, తమిళనాడు వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచినట్టు కేంద్రం ప్రకటించింది.