calender_icon.png 15 January, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితి 100 శాతానికి పెంపు

29-11-2024 12:00:00 AM

కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదన

న్యూఢిల్లీ, నవంబర్ 28: దేశీయ బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 100 శాతానికి పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. ఈ అంశమై వ్యాఖ్యానాలను, అభిప్రాయాలను డిసెంబర్ 10కల్లా తెలియపర్చాలంటూ డి పార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (డీఎఫ్‌ఎస్) పబ్లిక్‌ను కోరింది.

తాజా ప్రతిపా దనల్లో ఎఫ్‌డీఐ పరిమితిని ప్రస్తుత 74 శా తం నుంచి 100 శాతానికి పెంచడం, పెయిడ్‌అప్ క్యాపిటల్ పరిమితిని తగ్గించడం, కాంపోజిట్ లైసెన్సు (జీవిత, సాధారణ బీమాలకు ఒకే లైసెన్సు) ఇచ్చేలా నిబంధనల్ని సవరించడం వంటివి ఉన్నాయి. 

ఇన్సూరెన్స్ చట్టాల సవరణ

ఇన్సూరెన్స్ చట్టం 1938, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చట్టం 1956, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ అథారిటీ (ఐఆర్‌డీఏ) చట్టం 1999ల్లో సవరణలు ప్రతిపాదిస్తూ డీఎఫ్‌ఎస్ పబ్లిక్ వ్యాఖ్యానాలు కోరడం ఇది రెండోసారి.  2022 డిసెంబర్‌లో కూడా బీమా చట్టం 1938, ఐఆర్‌డీఏ చట్టం 1999ల్లో ప్రతిపాదిత సవరణలపై వ్యాఖ్యానాలను కోరింది.

పౌరులందరికీ బీమా సదుపాయాన్ని అందుబాటులోకి తేవడం, బీమా పరిశ్రమ అభివృద్ధికి, బీమా వ్యాపార ప్రక్రియలను సరళతరం చేయడం కోసం సంబంధిత చట్టాల సవరణలను ప్రతిపాదిస్తున్నట్లు ఈ నవంబర్ 26 తేదీతో జారీచేసిన ఆఫీస్ మెమొరాండంలో పేర్కొంది.

విదేశీ రీఇన్సూరెన్స్ సంస్థల సొంత నికర నిధుల పరిమితిని రూ. 5,000 కోట్ల నుంచి రూ. 1,000 కోట్లకు తగ్గించాలని కూడా మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. అలాగే కొన్ని విభాగాల్లోకి కొత్తగా ప్రవేశించే బీమా సంస్థల ప్రారంభ మూలధనాన్ని తక్కువగా నిర్ణయించే అధికారాన్ని ఐఆర్‌డీఏఐకి ఇవ్వాలని ప్రతిపా దించింది. ప్రస్తుతం దేశంలో 25 జీవిత బీమా కంపెనీలు, 34 సాధారణ బీమా సంస్థలు ఉన్నాయి.