హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Party Working President KTR) పై ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు(FDC Chairman Dil Raju) కీలక వ్యాఖ్యలు చెప్పారు. సీఎంతో సినీ ప్రముఖుల భేటిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అనవసర వివాదాల్లోకి తెలుగు చిత్ర పరిశ్రమను లాగొద్దని, పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దని దిల్ రాజు మండిపడ్డారు. రాజకీయ దాడి, ప్రతిదాడులకు పరిశ్రమను వాడుకోవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంతో జరిగిన సమావేశం చాటుమాటు వ్యవహరం కాదని, చిత్ర పరిశ్రమ బాగోగులపై స్నేహపూర్వకంగా చర్చ జరిగిందని అన్నారు.
సీఎంతో సమావేశంపై చిత్ర పరిశ్రమ సంతృప్తిగా ఉందని దిల్ రాజు చెప్పారు. రాష్ట్రభివృద్దిలో చిత్రపరిశ్రమ భాగస్వామ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించిందని హర్షం వ్యక్తం చేశారు. సామజిక సంక్షేమానికి సినీ పరిశ్రమ సహకారాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కోరినట్లు వెల్లడించారు. హైదరాబాద్ ను గ్లోబల్ హబ్ గా మార్చాలన్నది సీఎం సంకల్పమని గుర్తుచేశారు. సీఎం సంకల్పాన్ని చిత్ర పరిశ్రమ ప్రతినిధులంతా స్వాగతించినట్లు ఆయన పేర్కొన్నారు. లక్షలాది మందికి ఉపాధి ఇస్తున్న పరిశ్రమకు ప్రభుత్వ సహకారం కావాలని తాము కోరమని దిల్ రాజు తెలిపారు.