ఒకవైపు పెట్టుబడి రక్షణ కోరుకుంటూనే, మరోవైపు కాస్త రిస్క్ తీసుకుని, కొంచెం అధిక రాబడులను ఆశించేవారు డెట్ మ్యూచువల్ ఫండ్స్‌ను ఆశ్రయిస్తుంటారు. సురక్షిత మదుపు సాధనాల కోసం అన్వేషించేవారు సాధారణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లవైపు మొగ్గు చూపుతుంటారు. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌ను పోల్చిచూస్తే ఎఫ్‌డీల్లో పెట్టుబడులకు రిస్క్ చాలా తక్కువ. అవి నిర్ణీతకాలంలో గ్యారంటీ రాబడుల్ని అందిస్తాయి. ఎఫ్‌డీలతో పోలిస్తే వడ్డీ రేట్ల మార్పుల కారణంగా డెట్ ఫండ్స్‌లో కాస్త ఎక్కువ రిస్క్ ఉంటుంది.
ఈ రెండు పెట్టుడి సాధనాల్లో ట్యాక్స్ ట్రీట్‌మెంట్ విభిన్నంగా ఉంటుంది. ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీలో చేసే పెట్టుబడులకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద మినహాయింపు వర్తిస్తుంది. కానీ డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు ఆ మినహాయింపును 2023 బడ్జెట్లో తొలగించారు. డెట్ ఫండ్స్ నుంచి వచ్చే రాబడులకు పన్ను ఇన్వెస్టర్ల వ్యక్తిగత ఐటీ శ్లాబ్ ప్రకారం ఉంటుంది. అయితే ఎఫ్‌డీలపై వచ్చే వడ్డీ ఆదాయంపై కూడా వ్యక్తిగత శ్లాబ్ ప్రకారం పన్ను పడుతుంది.
మరోక కీలకాంశం ఏమిటంటే ఎఫ్‌డీ కాలపరిమితి ముగిసి, రెన్యువల్ చేసే ప్రతీ సందర్భంలోనూ టీడీఎస్‌ను బ్యాంక్ కట్ చేస్తుంది. అదే డెట్ మ్యూచువల్ ఫండ్స్‌కయితే టీడీఎస్ కటింగ్ ఉండదు. ఫండ్ యూనిట్లను రిడీమ్ చేసుకున్నపుడే ఇన్వెస్టర్లే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్ను వ్యత్యాసాల్ని మినహాయిస్తే ఫిక్స్‌డ్ డిపాజిట్లు, డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఒకే తరహాకు చెందినవి.
దీర్ఘకాలానికి డెట్ ఫండ్స్ రాబడులు అధికం
వడ్డీ రేట్లు పెరుగుతున్నా, తగ్గుతున్నా బాండ్ ఈల్డ్స్ పెరుగుదలతో డెట్ మ్యూచువల్ ఫండ్స్ నికర ఆస్తుల విలువ (ఎన్‌ఏవీ) దీర్ఘకాలంలో పెరుగుతుంది. డెట్ ఫండ్ యూనిట్లు ప్రయోజనాన్ని ఇస్తాయి. గత చరిత్రను పరిశీలిస్తే సాధారణంగా దీర్ఘకాలిక ఎఫ్‌డీలకంటే అదే మెచ్యూరిటీ సమయంలో డెట్ ఫండ్స్ రాబడులు ఎక్కువగా ఉన్నాయి.
అధిక పన్ను శ్లాబ్‌ల్లో ఉన్నవారికైతే డెట్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లాంగ్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను ప్రయోజనం లభిస్తుంది. కానీ ఎఫ్‌డీలు సురక్షితమైన గ్యారం టీ రాబడుల్ని అందిస్తాయి. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు కలిగినవారు దీర్ఘకాలిక డెట్ ఫండ్స్‌ను ఎంచుకోవాలని, స్వల్పకాలిక ఆర్థిక అవసరాలు కలిగినవారు ఎఫ్‌డీ లేదా లిక్విడ్, అల్ట్రాషార్ట్, మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
నిపుణుల సూచనలివి..
మీ పెట్టుబడి మొత్తంలో కొంత భాగాన్ని స్వల్పకాలిక (మూడేండ్లలోపు), అత్యవసర ఆర్థిక అవసరాల కోసం కొంత డెట్ ఫండ్స్‌లోనూ, మరికొంత ఎఫ్‌డీలోనూ పెట్టుబడి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వారాంతాల్లో అత్యవసరంగా డబ్బు అవసరమైనపుడు డెట్ ఫండ్ యూనిట్లను రిడీమ్ చేసుకోవడం సాధ్యం కాదు. అలాంటి అవసరాలకు ఆన్‌లైన్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను ఓపెన్ చేస్తే ప్రయోజనం ఉంటుంది.
కొంత పెనాల్టీ ఉన్నప్పటికీ, ఎఫ్‌డీని ముందుగానే క్లోజ్ చేసుకుని, ఏటీఎంల నుంచి డబ్బు డ్రా చేసుకోవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. స్వల్పకాలిక అవసరాలకు స్థిరరా బడులు ఇచ్చే ఎఫ్‌డీలే మెరుగని, మధ్య, దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాలకు అధిక రాబడుల్ని అందించే అవకాశం ఉన్న డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేయవచ్చని సూచిస్తున్నారు.
రెండు సాధనాల్లోనూ కొంత చొప్పున..
ఫిక్స్‌డ్ డిపాజిట్లు ముందస్తుగా విత్‌డ్రా చేసుకుంటే పెనాల్టీలు పడుతుంటాయి. వీటితో పోలిస్తే పెనాల్టీ లేకుండా డెట్ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ సౌలభ్యం కారణంగా రిస్క్ తీసుకోదల్చని ఇన్వెస్టర్లు వారి మదుపులో 60 శాతం ఎఫ్‌డీల్లో మదుపుచేసి, మరో 30 శాతం డబ్బును డెట్ ఫండ్స్‌లో పెట్టుబడి చేయవచ్చని ప్రైమ్ వెల్త్ ఫిన్‌సర్వ్ డైరెక్టర్ చక్రవర్తి సిఫార్సుచేశారు.
ఓ మోస్తరు రిస్క్‌కు సిద్ధపడి, అధిక రాబడుల్ని ఆశిస్తున్నవారు 40 శాతం ఎఫ్‌డీల్లోనూ, 50 శాతం డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లోనూ ఉంచుకోవాలన్నారు. అధిక రిస్క్ తీసుకోదల్చిన ఇన్వెస్టర్లు ఎఫ్‌డీల్లో 20 శాతమే ఇన్వెస్ట్‌చేసి, 70 శాతం నిధుల్ని డెట్ మ్యూచువల్ ఫండ్స్‌కు కేటాయించాలని సూచించారు.