calender_icon.png 23 October, 2024 | 9:00 AM

చిక్కిపోతున్న ఫతుల్లాగూడ చెరువు

29-08-2024 04:41:11 AM

  1. 14 ఎకరాల నుంచి 7ఎకరాలకు తగ్గిన విస్తీర్ణం  
  2. ఎఫ్‌టీఎల్‌లో వెలిసిన నిర్మాణాలు 
  3. పూడుకుపోయిన వరద కాలువలు 
  4. ఇటీవల ఆక్రమణలను పరిశీలించిన రంగనాథ్

ఎల్బీనగర్, ఆగస్టు 28: ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌లో కనీసం రెండు చొప్పున చెరువులు, కుంటలు ఉన్నాయి. గతంలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉండేవి. ప్రస్తుతం అవి కబ్జాకు గురవడంతో చెరువులు, కుం టలు మాయమవుతున్నాయి. నాగోల్ డివిజన్‌లోని ఫతుల్లాగూడ చెరువు ఒకప్పుడు తాగునీటిని అందించింది. ఇప్పుడు బక్కచిక్కి కనిపిస్తున్నది. 14 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఫత్తుల్లాగూడ చెరువు కబ్జాకు గురవడంతో ప్రస్తుతం ఏడెకరాలకే పరిమితమైం ది. ఒక్కొకక్కరుగా చెరువు భూములను ఆక్రమించి ఇండ్లు నిర్మించు కున్నారు. రాజకీయ అండ, ఆర్థిక బలానికి అధికారుల సైతం దాసోహమై అక్రమార్కులకు చెరువు భూమిని అప్పనంగా అప్పగించారు. 

ఫత్తుల్లాగూడ చెరువు

ఫతుల్లాగూడ చెరువు ఉప్పల్, అబ్దుల్లాపూర్ మండలాలతోపాటు పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలో విస్తరించి ఉన్నది. నాగోల్ డివిజన్‌లోని సర్వేనంబర్ 36లో 14 ఎకరాల విస్తీర్ణంతో ఫత్తులాగూడ చెరువు ఉన్నది. కబ్జాల అనంతరం 7 ఎకరాలకే పరిమితమైంది. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో కొందరు అధికారులు, రాజకీయ నాయకుల అండతో నిర్మాణాలు చేపట్టారు. చెరువులకు వచ్చే వరద కాల్వాలను పూడ్చివేయడంతో వర్షాలు పడినప్పుడు నీళ్లు సమీప కాలనీల్లోకి ప్రవేశిస్తున్నాయి. 

చెరువు శివారులో వెలిసిన కాలనీలు 

ఫతుల్లాగూడ చెరువు సమీపంలో ఫతుల్లాగూడ, మత్తుగూడ, సాయిసుప్రభాత్, కేతన్ ఎన్‌క్లేవ్ తదితర కాలనీలు వెలిశాయి. దీంతో భారీ వరదలు సంభవించినప్పుడు నీట ముగుతున్నాయి. ఎగువ ఉన్న నాగోల్ చెరువు నుంచి వచ్చే వరద నీరు ఫతుల్లాగూడ చెరువులో చేరేది. ఇతర పల్లపు ప్రాంతాల నుంచి కూడా నీరు వచ్చేది. చెరువు తూర్పుభాగానా అటవీప్రాంతం ఉన్నది. ఫారెస్టు ప్రాంతంలోని నీరు సైతం చెరువులోకి చేరుతుంది. కానీ, వరద కాలువలు కబ్జా కావడంతో వరద వచ్చే దారుల న్నీ మూసుకు పోయాయి.  

ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు

ఫతుల్లాగూడ చెరువు పరిధి ఉప్ప ల్, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల పరిధిలో ఉన్నది. చెరువు ఎఫ్‌టీఎల్‌ను ఆక్రమించి ప్లాట్లుగా చేసి అమాయక ప్రజలకు అమ్ముతున్నారు. కబ్జాలపై ఉప్పల్, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాధికారులతో పాటు పెద్దఅంబర్‌పేట ము న్సిపల్ అధికారులకు స్థానికులు అనేకసార్లు ఫిర్యాదు చేశారు. ఫతుల్లాగూడ చెరువు తమ పరిధిలోకి రాదం టూ అధికారులు తప్పించుకుంటున్నారు.

ఫిర్యాదులపై స్పందించిన హైడ్రా కమిషనర్ 

ఫతుల్లాగూడ చెరువు కబ్జాకు గురవుతుందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో జూలై 19న రెవెన్యూ, మున్సిపల్ అధికారులతతో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్  పరిశీలించారు. ఎఫ్‌టీఎల్ స్థలాన్ని ఆక్రమించి కొందరు లే అవుట్ చేసినట్లు ఆయన గుర్తించారు. ఫతుల్లాగూడ చెరువు రక్షణ కోసం గతంలో వేసిన ఫెన్సింగ్‌ను కూడా అక్రమార్కులు తొలిగించి స్థలాన్ని కబ్జా చేశారని తెలిపారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.