కలెక్టర్ బీ సత్యప్రసాద్
జగిత్యాల, జనవరి 30 (విజయక్రాంతి): జాతిపిత మహాత్మా గాంధీ మనందరికీ మార్గదర్శనీయుడని జగిత్యాల కలెక్టర్ బీ సత్యప్రసాద్ పేర్కొన్నారు. గురువారం గాంధీ వర్ధంతి సందర్భంగా జగిత్యాల కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో గాంధీజీ చిత్రపటానికి పూల మాలలు వేసి, మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసంగిస్తూ అహింస, సత్యాగ్రహాలే ఆయుధాలుగా, అఖండ భారతావనికి స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు ప్రసాదించిన మహా నాయకుడు గాంధీజీ అని కొనియాడారు. సమస్త విశ్వానికి శాంతి సందేశం ప్రబోధించి ‘జాతి పిత’గా కీర్తించబడిన మహాత్మా గాంధీ కుల, మతాలకు, ప్రాంతీయ, భాషా బేధాలకు అతీతుడని పేర్కొన్నారు.
నేటితరం యువతీ యువకులకు మహాత్మా గాంధీ జీవితం, ఆయన చూపిన మార్గదర్శనం ఆచరణీయమని కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు బిఎస్.లత, గౌతమ్’రెడ్డి, కలెక్టరేట్ అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.