నిరుపేద కుటుంబంలో పుట్టి, లక్ష్యానికి చేరువై..
ఏపీలో జడ్జిగా నియామకమైన గాయత్రి
పెద్దపల్లి, డిసెంబర్ 1 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలోని ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన గాయత్రి పట్టుదలతో చదివి జడ్జిగా నియామకమయ్యారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి తన లక్ష్యానికి చేరుకున్నారు. పెద్దపల్లి జిల్లాలోని జూలపల్లి మండలం వడ్కాపూర్ గ్రామానికి చెందిన మొగుర లక్ష్మి దంపతులు. వారికి కుమారులు అనిల్, అభిషేక్, కూతురు గాయత్రి ఉన్నారు.
మొండయ్య హమాలీ పనులతో పాటు వ్యవసాయ భూమిని కౌలు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఎన్ని ఆ ర్థిక ఇబ్బందులు ఎదురైనా భరిస్తూనే ము గ్గురినీ చదివించారు. ఇద్దరు కుమారులు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నారు. గాయత్రి స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పది వరకు చదువుకుని, పెద్దపల్లి ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు.
లా చేయాలన్న ఆమె సంకల్పంతో హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. అనంతరం పీజీ లా కామన్ ఎంట్రెన్స్ రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంక్ సాధించారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం విద్యనభ్యసించి, ఇంటి వద్దే చదువుకుని పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. ఇటీవల ఏపీ హైకోర్టు నిర్వహిం చిన న్యాయ సంబంధిత సివిల్ జడ్జి విభా గం పోటీ పరీక్షలు రాసింది. నవంబర్ 27న విడుదలైన ఫలితాల్లో గాయత్రి ఏపీలో జూనియర్ సివిల్ జడ్జిగా నియామకమయ్యారు. ఆమెను గ్రామ ప్రజలు, మిత్రులు, బంధువులు అభినందించారు. .