22-02-2025 12:51:38 AM
కామారెడ్డి జిల్లాలో విషాదం
ఆసుపత్రికి తరలింపు.. అప్పటికే మృతి
కామారెడ్డి, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): బంధువులంతా తన కూతురి పెండ్లి గురించి గొప్పగా చెప్పుకోవాలని ఓ తండ్రి అన్నీ తానై దగ్గరుండి పెండ్లి ఏర్పా ట్లు చేశాడు.. పెండ్లి కూతురుగా ముస్తాబై పీటలెక్కిన తన కూతురిని చూస్తూ మురిసిపోయాడు.. అల్లుడి కాళ్లు కడిగి, కన్యాదానం చేసిన కాసేపటికే గుండెపోటుతో మృతిచెందాడు.
ఈ విషాదకర ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లికి చెందిన కొడిక్యాల బాలచంద్రం (56) కామారెడ్డిలో హౌసింగ్ బోర్డ్ కాలనీలో కుటుంబ సభ్యులతో కలిసి గత కొన్నేళ్లుగా నివాసముంటున్నాడు. స్థానిక గాంధీ గంజిలో ఓ దుకాణంలో పనిచేస్తున్నాడు.
బాలచంద్రంకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు కనక మహాలక్ష్మివివాహం శుక్రవారం దోమకొండ బైపాస్ చౌరస్తాలోని ఇంద్రప్రస్థాలో నిర్వహించగా.. అల్లుడి కాళ్లు కడిగి కన్యాదానం పూర్తి కాగానే అక్షింతలు వేసి ఆశీర్వదించాడు. అంతలోనే గుండెపోటు రావడంతో కల్యాణ మండ కుప్పకూలాడు.
బాలచంద్రంను వెంటనే స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. కూతురు పెండ్లి సంబురం పూర్తవకముందే తండ్రి మృతిచెందడం పెండ్లికి వచ్చిన బంధువులను కలిచివేసింది.