పాల ట్యాంకర్‌ను ఢీకొట్టిన డబుల్ డెక్కర్ బస్సు
18 మంది మృతి, 19 మందికి గాయాలు
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ప్రధాన మంత్రి
న్యూ ఢిల్లీ: ఉత్తప్రదేశ్‌లోన్ ఉన్నావ్ ప్రాంతంలో పాల ట్యాంకర్‌ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టగా.. 18 మంది మరణించారు. మరో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో చనిపోయినవారిలో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్ల సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం తెల్లవారుజామున బీహార్‌లోని మోతిహారి నుంచి ఢిల్లీ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ ప్రాంతంలో పాల ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీ కొట్టింది.
ప్రమాద ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. 18 మంది చనిపోగా.. 19 మందికి తీవ్ర గాయాలయ్యాయని ఉన్నావ్ జిల్లా కలెక్టర్ గౌరంగ్ రాఠీ తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై యూపీ ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించారు. ప్రమాదంలో చనిపోయినవారికి ప్రధాని మోడీ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడినవారికి రూ.50వేల పరిహార ప్రకటించారు. రాష్ట్రపతి ముర్ము కూడా ప్రమాద ఘటనపై సంతాపం తెలిపారు.