కుంభమేళాకు వెళ్లొస్తూ ఏడుగురు హైదరాబాదీల దుర్మరణం
- మధ్యప్రదేశ్‌లో మినీ బస్సును ఢీకొన్న లారీ
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి
- ప్రమాద ఘటన దురదృష్టకరం: కిషన్‌రెడ్డి
- దుర్ఘటన కలచివేసింది: బండి సంజయ్
మేడ్చల్, ఫిబ్రవరి 11(విజయక్రాంతి)/మేడిపల్లి: ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమే ళాకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు దుర్మరణం చెందారు. వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును రాంగ్ రూట్‌లో వచ్చిన సిమెంట్ లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పో యారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్న ట్టు తెలుస్తున్నది.
మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లా సిహోర సమీపంలో వంతెన మీద మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. లారీ వేగంగా వచ్చి ఢీకొనడంతో మినీ బస్సు తునాతునకలై కొన్ని భాగాలు బ్రిడ్జి కింద పడ్డాయి. బస్సులో మొత్తం 14 మంది ఉండగా ఏడుగురు మృతిచెందారు. మిగిలిన వారికి తీవ్రగాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరు సిహోర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మినీ బస్సు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా మొదట ఆంధ్రప్రదేశ్ వాసులుగా భావించారు. తర్వాత మృతదేహాల వద్ద దొరికిన ఆధారాలను బట్టి హైదరాబాద్ నగరంలోని నాచారం ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు.
మృతుల్లో నాచారం కార్తికేయ నగర్‌కు చెందిన రాంపల్లి రవికుమార్(56), బోరంపేట సంతోశ్(47), సురకంటి మల్లారెడ్డి (64), నాచారం శ్రీరామ్‌నగర్‌కు చెందిన కల్కూరి రాజు(38), నాచారం రాఘవేంద్రనగర్‌కు చెందిన సోమవరం శశికాంత్(38), మూసారంబాగ్‌కు చెందిన ఆనంద్(47), తార్నాక గోకుల్ నగర్‌కు చెందిన టీవీ ప్రసాద్(55) ఉన్నారు. చికిత్స పొందుతున్న వారిలో చైతన్యపురికి చెందిన నవీన్ చారీ, కార్తికేయ నగర్‌కు చెందిన శ్రీరామ్ బాలకృష్ణ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తున్నది.
నాచారంలో విషాదఛాయలు
ప్రమాద వార్త తెలియగానే నాచారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరంతా స్నేహితులని, మినీ బస్సు మాట్లాడుకుని వెళ్లారని స్థానికులు తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. బీజేపీ మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఏనుగు సుదర్శన్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందేలా చూస్తున్నారు. మృతదేహాలను హైదరాబాద్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
ప్రమాద ఘటన దురదృష్టకరం: కిషన్‌రెడ్డి
ఈ ప్రమాద ఘటన దుదదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులను కిషన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. మధ్యప్ర దేశ్ ప్రభుత్వంతో మాట్లాడి మృతుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని సూచించారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లతో మాట్లా డి ఆయా కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించాలని ఆదేశించారు.
జబల్‌పూర ఘటన కలచివేసింది: బండి సంజయ్
జబల్‌పూర్ ఘటన తనను కలిచివేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జబల్‌పూర్ కలెక్టర్, ఎస్పీలకు ఫోన్ చేసి క్షతగాత్రులకు సహాయ, సహకారాలు అందించాలని ఆదేశించారు. ఈ ఘటనపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మెరుగైన వైద్యం అందించాలి: ముఖ్యమంత్రి
జబల్‌పూర్ రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు మృతిచెంది నట్లు సమాచారం అందటంతో వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందేలా ఏర్పాట్లు చేయాలని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.